ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదు : తెలంగాణ సర్కార్‌

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదు : తెలంగాణ సర్కార్‌

తెలంగాణలో ఆర్టీసీ పోరు ఆగడం లేదు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా సమ్మె ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు కార్మికులు. సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నేటితో సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఇవాళ అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు వాంటా వార్పులతో నిరసన వ్యక్తం చేయనున్నారు. వివిధ రకాల నిరసన ప్రదర్శనలతో హీట్‌ పెంచనున్నారు.

ఈ నెల 19న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ... రోజువారీ ఆందోళనల్ని తీవ్రతరం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. సమ్మెలో భాగంగా ఇవాళ వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనుండగా... రేపు డిపోల ముందు బైఠాయింపులతో ఆందోళన చేయనున్నారు. 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న విద్యార్థి సంఘాల ర్యాలీలు, 17న ధూంధాంలు, ఉద్యోగ సంఘాల ఆందోళన, 18న బైక్‌ ర్యాలీలు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ జేఏసీ... 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ను అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరింది.

ఆర్టీసీ సమ్మెకు రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలవడంతో సమ్మె మరింత బలంగా మారుతోంది. కొన్ని చోట్ల సమ్మె ఉద్రిక్తతకు దారి తీస్తోంది. బస్సు అద్దాలను ధ్వంసం చేసి తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటుండడంతో అటు ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఇలాంటి దాడులను ఉపేక్షించేంది లేదని... కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇప్పటికే డీజీపీకి ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌... ప్రతి డిపో వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో డిపోల ముందు పోలీసులు భారీగా మోహరిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేది లేదని స్పష్టం చేస్తోంది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదని, ఎవరి బెదిరింపులకు భయపడేదిలేదన్నారు సీఎం కేసీఆర్‌. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్‌ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెండు మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడపాలని అధికారులను అదేశించారు సీఎం కేసీఆర్‌. అటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది సర్కార్‌.

Tags

Read MoreRead Less
Next Story