చిరు, జగన్ భేటీ.. విషయం ఏంటో?

చిరు, జగన్ భేటీ.. విషయం ఏంటో?
X

సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మధ్యాహ్నం లంచ్‌ మీటింగ్‌ కోసం చిరు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్తున్నారు. తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఆయన జగన్ ఇంటికి వెళ్తున్నారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీయేనని చెప్తున్నా.. ఈ ఇద్దరు ప్రముఖుల భేటీ అందర్లో ఆసక్తిరేపుతోంది. సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలంటూ జగన్‌ను ఆహ్వానించనున్నారు చిరు. సీఎం వీలును బట్టి స్పెషల్ షో వేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు రెండు మూడు గంటలపాటు వీరిద్దరి సమావేశం జరిగే అవకాశం ఉంది. నిజానికి 11వ తేదీనే భేటీ కావాల్సి ఉన్నా.. అది ఇప్పటికి వాయిదా పడింది. ఈ విందు సమావేశం అటు వైసీపీ శ్రేణుల్లోనూ, మెగా అభిమానుల్లోనూ చర్చనీయాంశమైంది.

కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. ఇప్పుడు ఏపీ సీఎంను ఎందుకు కలుస్తున్నారనేది హాట్ టాపిక్ అయ్యింది. సినిమా ఫంక్షన్లు, ఫ్యామిలీ పంక్షన్లలో తప్ప పవన్ కల్యాణ్‌ను కూడా చిరంజీవి ప్రత్యేకంగా కలిసిన సందర్భం లేదు. అలాంటిది ఇప్పుడు సచివాలయానికి బదులు ఏకంగా సీఎం ఇంటికే వెళ్తుండడం వెనుక లెక్కేంటో అంతు పట్టడం లేదు. దసరాకి రిలీజైన సైరా సినిమాకి అదనపు షో లు వేసుకోవడానికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇది మర్యాదపూర్వక భేటీయేనని మెగాస్టార్ సన్నిహితులు చెప్తున్నారు.

200 కోట్ల బడ్జెట్‌తో 5 భాషల్లో రిలీజైన సైరా సినిమా బాగానే కలెక్షన్లు రాబట్టింది. సీమ స్వాతంత్య్ర సమరయోధుడి కథాశంతో తెరకెక్కిన చిత్రానికి బాలీవుడ్‌లో కూడా స్పందన బావుంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రొడ్యూసర్ రాంచరణ్. సోమవారం సీఎంతో భేటీలో ప్రధానంగా సినిమాపైనే చర్చ జరుగుతుందంటున్నారు.

Tags

Next Story