బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ?

బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ?

టీమ్ ఇండియా మాజీ కెప్టన్ సౌరబ్ గంగూలీ సరికొత్తపాత్రలో మెరవనున్నాడు. గతంలో టీంఇండియాను నడిపించిన గంగూలీ... ఇప్పుడు క్రికెట్ ఇండియానే నడిపించేందుకు సిద్దమవుతున్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవడం దాదాపు ఖాయమైంది. పలు నాటకీయ పరిణామాల మధ్య బ్రజేష్ పటేల్ పోటీ నుంచి తప్పుకోవడంలో గంగూలీకి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న 47 ఏళ్ల గంగూలీ కొత్త బాధ్యతలు తీసుకుంటారు.

23న బిసిసిఐ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలో జరిగిన బిసిసిఐ వివిధ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు సమావేశమై ఎన్నిక లేకుండా ఏకాభిప్రాయంతో కమిటీ ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీనివాసన్ శిష్యుడు బ్రజేష్ పటేల్ అవుతారని అంతా భావించారు. ఐపీఎల్ ఛైర్మన్ గా గంగూలీకి అప్పగించాలనుకున్నారు. అయితే గంగూలీ ఐపీఎల్ ఛైర్మన్ పదవి తిరస్కరించడంతో ఆయన్నే బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బ్రజేష్ పటేల్ కు ఐపీఎల్ ఛైర్మన్ పదవి అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. అయితే అధికారికంగా సోమవారం ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అటు బిసిసిఐ కమిటీలో అనూహ్యంగా కార్యదర్శి పదవికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా పేరు తెరమీదకు వచ్చింది. గుజరాత్ క్రికెట్ సంఘంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన ఈ పదవికి పోటీపడుతున్నారు. ప్రత్యర్ధి ఎవరూ లేకపోవడంతో ఆయన పేరు ఖరారు అయింది. అటు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు మంత్రి అనురాగ్ ఠాకూర్ సొదరుడు అరుణ్ దుమాల్ కోశాధికారిగా పోటీలో ఉన్నారు. మొత్తానికి బిసిసిఐలో కూడా కమల వికాసం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story