ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్!

మహారాష్ట్రలో ఎన్నికల క్యాంపెయిన్ తారాస్థాయికి చేరింది. అధికార,విపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. జలగావ్‌లో జరిగిన ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే వారికి రాజకీయ భవిష్యత్ లేదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి ఆర్టికల్ 370ని తీసుకువస్తామని తమ మ్యానిఫెస్టోల్లో విపక్షాలు చేర్చగలవా అంటూ సవాల్ చేశారు మోదీ.
56 అంగుళాల చాతి ఉన్న మనిషి ఒకేసారి ఆర్టికల్ 370ని రద్దు చేశారని.. ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు అమిత్ షా. మహారాష్ట్రాలోని కొల్హా పూర్‌లో రోడ్ షో నిర్వహించిన ఆయన మోదీని కొనియాడారు. దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్లాయని.. అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు.. వెళ్లారు కాని.. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని.. కానీ మోదీ మాత్రమే పరిష్కారం చూపించారని అమిత్ షా గుర్తు చేశారు.
మరోవైపు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు అమిత్ షా. మహారాష్ట్రకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేసిందని ప్రశ్నించారు. అందుకే ఇక్కడ ప్రజలంతా బీజేపీ మరోసారి పట్టం కట్టాలని చూస్తున్నారని షా అభిప్రాయపడ్డారు. కొల్హార్‌లో అమిత్ షా రోడ్డు షోకు జనం నీరాజనం పలికారు. రోడ్లపై భారీగా చేరి ఘన స్వాగతం పలికారు.
మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రభుత్వం చంద్రుడిని చూడాలని చెబుతోందని ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2ను ప్రస్తావించారు రాహుల్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ లాతూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. మోదీ మేజిక్, అమిత్ షా మంత్రాంగంపై కమలదళం ధీమాగా ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అధికారం కట్టబెడుతుందనే ఆశలో విపక్షాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com