ఆర్టీసీ సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు

ఆర్టీసీ సమ్మెపై కఠినంగానే వ్యవహరించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. తాజాగా తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ నియమించింది. మరికొంత మందిని తీసుకోవడం ద్వారా బస్సులను పూర్తిస్థాయిలో రోడ్డెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. పోలీస్ శాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన డ్రైవర్ల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. వీటితోపాటు మెకానిక్‌, శ్రామిక్‌, టైర్ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రతిపక్షాల వలలో పడ్డాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు ఎర్రబెల్లి.

సమ్మె పేరుతో ఆర్టీసీ యూనియన్లు.. కార్మికులను వాడుకుంటున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. సమ్మెపై పునరాలోచన చేయాలని కోరారు. సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు తమనెందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి. ఉద్యోగుల సమస్యల సాధన కోసం ముఖ్యమంత్రిని కలిస్తే, వక్రీకరించడం బాధాకరమని అన్నారు. ఉద్యోగుల మధ్య రాజకీయపక్షాలు చిచ్చు పెడుతున్నాయని అన్నారు రవీందర్ రెడ్డి.

ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం కేసీఆర్. మరో రెండు రోజుల్లోగా వంద శాతం బస్సుల్ని రోడ్డెక్కించాలని ఇప్పటికే ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగానే.. తాత్కాలిక పద్ధతిలో అన్ని విభాగల్లోనూ ఉద్యోగుల్ని భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం తాము లాభాల కోసం ఆర్టీసీని నడపడం లేదని.. ప్రజల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story