మరో రికార్డు సృష్టించనున్న దాదా

మరో రికార్డు సృష్టించనున్న దాదా

బెంగాల్‌ టైగర్‌.. ప్రిన్స్‌.. దాదా అని క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్‌ గంగూలీ మరో రికార్డు సృష్టించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కబోతున్నాడు. అప్పట్లో విజయనగరం మహారాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు గంగూలీకే ఆ ఖ్యాతి దక్కనుంది.

1936లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు విజయనగరం మహారాజు సారథ్యం వహించారు. భారత్ తరపున కేవలం మూడు టెస్టులకే ప్రాతినిధ్యం వహించిన విజ్జీ 1954-1956 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, శివ్‌లాల్ యాదవ్‌లు 2014లో బీసీసీఐ అధ్యక్షులుగా సేవలు అందించినప్పటికీ అది తాత్కాలికమే కావడంతో లెక్కలోకి వచ్చే అవకాశం లేదు. ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా, గంగూలీ ఒక్కడే టాప్ పోస్టుకు నామినేషన్ దాఖలు చేశాడు. అతడిని వ్యతిరేకించేవారు ఎవరూ లేకపోవడంతో గంగూలీ ఎన్నిక లాంఛనం కానుంది.

టీమిండియా క్లిష్ట దశలో ఉన్నప్పుడు.. కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన గంగూలీ జట్టు రాతనే మార్చేశాడు. విదేశాల్లోనూ విజయం సాధించగలమనే నమ్మకం కల్గించాడు. ముఖ్యంగా నాయకుడిగా తన జట్టు సభ్యులకు దూకుడు నేర్పాడు. యువతకు పెద్దపీట వేస్తూ అద్భుతాలు సృష్టించాడు. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచ నెంబర్‌ వన్‌గా ఉంది అంటే.. గంగూలీ వేసిన పునాదులే కారణమన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ బాస్‌గా కూడా తనదైన ముద్ర వేసేందుకు సై అంటున్నాడు. ప్రస్తుతం పలు ఆరోపణలతో బీసీసీఐ పాలన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించిన పరిపాలన కమిటీకి.. బోర్డు ప్రతినిధుల మద్య చాలా గ్యాప్‌ కనిపిస్తోంది. బీసీసీఐ తీసుకున్న చాలా నిర్ణయాలు వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పెద్ద సవాలే. అయినా బోర్డులో సంస్కరణలు తీసుకోస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రస్తుతం క్రికెట్ బోర్డు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను పట్టంచుకోవడం లేదని గంగూలీ అభిప్రాయపడుతున్నాడు. అందుకే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌పై ఫోకస్‌ చేసి.. యువ క్రికెటర్లు వెలికి తీయాలి అనుకుంటున్నాడు.

బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోయే గంగూలీకి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఇటు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags

Next Story