మళ్లీ మొదలవుతోన్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పర్యాటక బోటు మునిగి నెల రోజులైంది. గత నెల 15వ తేదీన బోటు గోదావరిలో మునిగిపోయింది. అప్పటి నుంచి అనేకసార్లు దానిని బయటకు తీసేందుకు అటు సహాయక బృందాలు, ప్రభుత్వం, ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మూడోసారి బోటు వెలికితీత పనులను చేపట్టేందుకు ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. పొక్లెయినర్, ఇనుప తాళ్లు, ఇతర సామగ్రితో ధర్మాడి బృందం కచ్చులూరు చేరుకుంది. మంగళవారం నుంచి మరోసారి సంప్రదాయ పద్ధతుల్లోనే ఆపరేషన్ కొనసాగుతుంది.
బోటు పైకి తీయడానికి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇనుప తాడును వృత్తాకారంలో నదిలో వేసి.. వాటి కొసలను ఒడ్డున ఉన్న పొక్లెయిన్‌తో లాగడం ద్వారా గాలింపు చేపడతారు. ఒకవేళ ఏదైనా తగిలినట్టు అనిపిస్తే.. లంగరు వేసి దాన్ని ఒడ్డుకు లాగుతారు. ఇందుకోసం దాదాపు 1000 మీటర్ల తాడును ఉపయోగిస్తోంది ధర్మాడి సత్యం బృందం. అలాగే బోటు మునిగిందని అంచనా వేస్తున్న ప్రాంతానికి పంటు ద్వారా వెళ్లి.. అక్కడ లంగరు వేసి కూడా గాలింపు చేపడతారు.
బోటులో మరో పది మృతదేహాలు ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. బోటును వెలికితీస్తే తమవారి జాడ దొరుకుతుందని అటు గల్లంతైన వారి బంధువులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. గత నెల 23వ తేదీ వరకూ ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీతకు ప్రయత్నించి చేతులెత్తేసింది. ఆ తర్వాత 30న మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈనెల మూడో తేదీ వరకూ కొనసాగించింది. నదిలో వరద ఉధృతి కారణంగా గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవడంతో ఇప్పటివరకూ బ్రేక్ ఇచ్చారు. వరద పోటు తగ్గడంతో కలెక్టర్ అనుమతితో ధర్మాడి సత్యం బృందం మళ్లీ పనులు మొదలు పెట్టనుంది.
గతంలో చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం.. ఇనుప రోప్ తెగిపోవడం వంటి అనుభవాల దృష్ట్యా.. ఈసారి మరింత పకడ్బందీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనుంది సత్యం బృందం. అయితే, గోదావరిలో బోటు మునిగిన ప్రాంతంలో దాదాపు 250 అడుగుల లోతు ఉండటంతో పనులు ముందుకు సాగుతాయా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చులూరులో బోటు మునిగిన ప్రాంతంలో గతంలోనూ ఉదయభాస్కర్ అనే పడవ మునిగి 60 మంది జలసమాధి అయ్యారు. దాన్ని ఇంతవరకు బయటకు తీయలేకపోయారు. ఇప్పుడు రాయల్ వశిష్టను కూడా బయటకు తీయగలరా లేదా అనే సందేహం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com