ఏపీలో రైతు భరోసా.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అమలు చేసేదిశగా వైసీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రైతుకు పెట్టుబడి సాయం అందించే భరోసా పథకం మంగళవారం ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లాలో జరిగే సభలో సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరులోని సింహపురి విశ్వవిద్యాలయం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి వేదిక కానుంది.
మొదట సభను ముత్తుకూరులో నిర్వహించాలని భావించినా, అనుకూలంగా లేకపోవడంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి షిఫ్ట్ చేశారు. బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. సభా వేదిక ముందు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు సంబంధించిన ప్రదర్శనశాలలు, యంత్ర పరికరాలను సీఎం, రైతులు తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి సాయాన్ని రూ.12 వేల 5 వందల నుంచి 13 వేల 5 వందలకు పెంచింది. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి అందిస్తుండడంతో.. పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజనగా నామకరణం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి రూ. 5 వేల 510 కోట్ల నిధులు విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో రైతులకు సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా 40 లక్షల మంది లబ్ది పొందుతారన్నారు మంత్రి కన్నబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


