తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడుతుందా?

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడుతుందా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె చర్చల దిశగా పయనిస్తోందా..? తాజా పరిణామాలు ఇవే సంకేతాలనిస్తున్నాయి.. ఓ వైపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న కార్మిక సంఘాలు.. ధర్నాలు, రాస్తారోకోలు, వాంటావార్పులు చేపడుతున్నారు. అయితే, కొందరు కార్మికులు ఉద్వేగాలకు గురవుతుండడంతో.. ఇటు ప్రభుత్వం.. అటు కార్మిక సంఘాలు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. దీంతో చ‌ర్చలు జ‌రిగితేనే మంచిద‌నే అభిప్రాయం ఇరువైపులా వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ సమ్మె కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని.. బలవన్మరణం ఏ సమస్యకు పరిష్కారం చూపదన్నారు కేకే. పరిస్థితులు చేయి దాటకముందే యూనియన్ నేతలు సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప.. మిగతా డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని లేఖ‌లో పేర్కొన్నారు. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో కేసీఆర్‌ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని కేకే అన్నారు. అయితే అధిష్టానం అదేశాల‌తోనే కేకే ప్రక‌ట‌న విడుద‌ల చేశారనే ప్రచారం జ‌రుగుతోంది. అస‌లు కార్మికుల‌తో చ‌ర్చలే ఉండ‌వ‌ని స‌ర్కారు చెప్తూ వస్తున్నా.. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేకే ప్రక‌ట‌న‌తో కొంత సానుకూల వాతావ‌ర‌ణం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేశవరావు.. ఇదే అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికులతో సంప్రదింపుల కోసం మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరుణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించానన్నారు. అయితే, తమ బాస్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారమే ముందుకు సాగుతానని కేశవరావు చెప్పారు.

అటు కేకే లేఖను ఆర్టీసీ జేఏసి స్వాగ‌తించింది. ఆయన మ‌ధ్యవ‌ర్తిత్వంలో చ‌ర్చల‌కు సిద్ధమని కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రక‌టించారు. కానీ ముందే స‌మ్మె విరమించ‌డం కుద‌ర‌ద‌ని కార్మిక సంఘాలు తేల్చి చెబుతున్నాయి. డిమాండ్లపై ప్రభుత్వ విధానం స్పష్టంచేసిన త‌ర్వాతే త‌మ నిర్ణయాలుంటాయని నేత‌లు అంటున్నారు.

కేకే మ‌ధ్యవ‌ర్తిత్వంలో మంగళవారం చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి చ‌ర్చలు మొద‌లైతే సమ‌స్యల ప‌రిష్కారానికి మార్గం దొరుకుతుంద‌ని ఇరువైపులా భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story