తూర్పుగోదావరి జిల్లాలో పత్రికా విలేకరి దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లాలో పత్రికా విలేకరి దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా తునిలో పత్రికా విలేకరి సత్యనారాయణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆంధ్రజ్యోతి పత్రికకు తొండంగి అర్బన్‌ రిపోర్టర్‌గా సత్యనారాయణ పనిచేస్తున్నాడు. ఎస్‌.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై సత్యనారాయణను అడ్డగించిన దుండగులు ఆయనతో ఘర్షణకు దిగారు. మరు క్షణంలోనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఆయనపై దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచారు. దుండగుల దాడిలో సత్యనారాయణ అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సత్యనారాయణ హత్యపై అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. నెలరోజుల క్రితం భూ వివాదానికి సంబంధించి ఓ వార్త ఇచ్చారు సత్యనారాయణ. ఆ కథనంపై కన్నెర్ర చేసిన మరో వర్గం కక్ష పెంచుకుని పథకం ప్రకారం హత్య చేసినట్లుగా సత్యనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇతనిపై దాడి చేశారు దుండగులు. అప్పుడు తప్పించుకున్న సత్యనారాయణ.. ఈసారి మాత్రం ప్రాణాలు దక్కించుకోలేకపోయాడు. హత్య వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటు సత్యనారాయణ మృతి వార్తతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. నిందితులను పోలీసులు తక్షణం గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి. హత్యల ద్వారా పాత్రికేయుల గొంతు నొక్కాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story