లంగరుకు చిక్కినట్టే చిక్కి.. జారిపోయిన బోటు!

ఆశలు చిగురిస్తున్నాయి. బోటు వెలికిత ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోంది. కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటును ఒడ్డుకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బుధవారం లంగరుకు చిక్కినట్టే చిక్కి.. జారిపోయిన నేపథ్యంలో శుక్రవారం మరింత పకడ్బందిగా ఆపరేషన్ కొనసాగించనున్నారు. ప్రస్తుతం నదిలో 150 అడుగుల లోతులో, ఇసుకలో కూరుకుపోయిన స్థితిలో బోటు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంత మేర కిందకు కొట్టుకు వెళ్లినట్టుగా నిర్థారణ అవడంతో.. ప్రస్తుతం బోటు ఉందని అంచనా వేస్తున్న చోట 3 లంగర్లను వదిలి గాలిస్తున్నారు.
150 అడుగుల లోతులో బోటు ఉన్నందున గజఈతగాళ్లను పంపి లంగరు వేయిస్తే ఫలితం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఐతే.. ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి కావాల్సి ఉంది. విశాఖపట్నానికి చెందిన ఎక్స్‌పర్ట్ వస్తే.. అతనికి ఆక్సిజన్ మాస్క్‌తోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లన్నీ చేసి నీళ్లలోకి పంపాలనుకుంటున్నారు. ఐతే, కలెక్టర్ ఆదేశాలు వచ్చే వరకూ ప్రస్తుతం గాలిస్తున్న తీరులోనే సెర్చింగ్ కొనసాగించనున్నారు.
ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి బాగా తగ్గింది. సహాయ చర్యలకు కాస్త అనుకూలంగానే వాతావరణం ఉంది. దీన్ని ఉపయోగించుకుని పడవను పైకి లాగేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ లంగరుతోపాటు 3 వేల అడుగుల ఇనుప తాడును, ఒక వెయ్యి మీటర్ల నైలాన్ తాడును కూడా ఇందుకోసం వాడుతున్నారు. నిన్న గాలింపు కొనసాగిస్తున్నప్పుడు లంగరుకు చిక్కినట్టే చిక్కి మిస్సయినా ఆ సమయంలో నీళ్లపైకి తెల్లని రంగు తేలిందని ధర్మాడి సత్యం చెప్తున్నారు. అది లంగరుకు బోటు తగులుకున్న కారణంగా పెయింట్ ఊడడం వల్లే జరిగిందని అంచనా వేస్తున్నారు. ఏదైమైనా గతంలో పోలిస్తే బోటు మునిగిన ప్రాంతాన్ని, అది ఉన్న లోతును కాస్త కచ్చితంగా అంచనా వేసినందున.. వీలైనంత త్వరగా దాన్ని ఒడ్డుకు లాక్కొస్తామంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com