కలెక్టరేట్‌లో కోడిగుడ్ల టెండర్లు.. అధికారపార్టీ నేతల ఘర్షణ

కర్నూలు కలెక్టరేట్‌లో మిట్ట మధ్యాహ్నం రౌడీబ్యాచ్ చెలరేగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన టెండర్ దాఖలు చేసేందుకు వచ్చిన వారిని అడ్డుకుని భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశ్నించిన వారిని అధికారుల సమక్షంలోనే కర్రలతో చితక్కొట్టారు. సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారిని హెచ్చరిస్తూ రాళ్ల వర్షం కురిపించి పరారయ్యారు. సాక్షాత్తు కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయం ఆవరణలోనే ఈ ఘర్షణ జరిగింది.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్లు పిలిచారు. ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచిన అధికారులు చివరి రోజున ఆఫ్ లైన్‌లో ఒక గంట పాటు టెండర్లు దాఖలుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య టెండరు దాఖలు చేయవచ్చని ప్రకటించడంతో.. డోన్‌కి చెందిన అధికార పార్టీ యూత్ లీడర్ వర్గీయులు కలెక్టరేట్‌కు వచ్చారు. యునైటెడ్ ట్రేడర్స్ ప్రతినిధులమంటూ వచ్చి.. ఇక ఇతరులెవరూ టెండర్లు దాఖలు చేయవద్దని హెచ్చరించారు. అధికారుల సమక్షంలోనే బెదిరింపులకు దిగుతూ హల్‌చల్ చేశారు. సెల్ ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారిని చుట్టుముటి బెదిరించి ఫోన్లు లాక్కున్నారు. ఓ యువకుడిని కర్రలతో చితక్కొట్టడంతో తల పగిలి రక్తం కారింది. డీఈఓ ఆఫీసు సిబ్బంది కూడా ఈ గొడవతో భయపడిపోయారు. తోపులాటలో ఓ మహిళా ఉద్యోగిని కిందపడి గాయపడింది. యునైడెట్ ఏజన్సీ వర్గీయులతోపాటు, మారుతీ ఆగ్రోస్ ఏజెన్సీ వాళ్లు, శివతేజ వర్గీయులు కూడా టెండర్లు వేశారు. డోన్, నందికొట్కూరుకు చెందిన అధికారపార్టీ నేతలు దౌర్జన్యానికి దిగడంతో.. కలెక్టరేట్ కాంపౌడ్ అంతా కాసేపు రణరంగంగా మారింది.
కలెక్టరేట్‌లో ఘర్షణను త్రీటౌన్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడింది.. గాయపడింది ఇరువురూ అధికార వైసీపీకి చెందిన వారేనని నిర్థారణకు వచ్చారు. ఐతే.. తమ నాయకుల పేర్లు చెప్పకుండా ఈ బ్యాచ్‌లు జాగ్రత్తపడ్డారు. జరిగిన సంఘటనను చిన్నది చేసి చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com