ఫుల్ స్టాప్‌ పడని కార్మికుల సమ్మె.. ఆర్టీసీ పరిస్థితిపై అయోమయం

ఫుల్ స్టాప్‌ పడని కార్మికుల సమ్మె.. ఆర్టీసీ పరిస్థితిపై అయోమయం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్‌ పడడం లేదు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ధర్నాలు, రాస్తారోకోలతో సమ్మె ఉధృతిని మరింత పెంచుతున్నారు. చర్చలు చేపట్టి రెండు రోజుల్లో శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి, ఇటు కార్మికుల హైకోర్టు సూచించినా ఆ దిశగా అడుగులు మాత్రం కనిపించడం లేదు. ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చకు సిద్ధం అంటున్నా.. అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. దీంతో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు.

సమ్మెను ఉధృతం చేస్తున్న కార్మిక సంఘాలు.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలతో వరుస భేటీలు అవుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు.. సమ్మెకు మద్దతు కూడగడుతున్నారు. ఎల్లుండి చేపట్టనున్న తెలంగాణ బంద్‌కు అన్ని పార్టీలు ఇప్పటికే మద్దతు పలికాయి. అటు మొన్నటి వరకు దూరంగా ఉన్న టీఎన్జీవో, టీజీవో కూడా ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు పలకడంతో సమ్మెను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. గురువారం ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ జోషిని కలవనున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించాలని సీఎస్‌ను కోరనున్నారు.

సమ్మె కార్యాచరణలో భాగంగా గురువారం ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధూంధాంలు నిర్వహించనున్నారు. అఖిలపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టనున్నాయి. తెలంగాణ బంద్‌కు కార్మికులు సన్నద్ధం అవుతుండడంతో ఇప్పటికే డిపోల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రత మధ్య బస్సు సర్వీసులు ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో ఆర్టీసీ పరిస్థితిపై అయోమయం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story