భూ కుంభకోణంపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

భూ కుంభకోణంపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం
X

విశాఖలో భూ కుంభకోణంపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సిట్ ఏర్పాటు చేయగా.. అది దర్యాప్తు జరిపి నివేదిక కూడా సమర్పించింది. అయితే, తాజాగా జగన్‌ సర్కార్‌ సిట్‌ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమవుతోంది. అప్పటి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కొత్త జీవో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం.

విశాఖలో భూ కుంభకోణంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, భూ రికార్డుల తారుమారు, అసైన్డ్ భూముల ఆక్రమణలపై సిట్ విచారణ జరపనుంది. గత ప్రభుత్వం హయాంలో విశాఖలో భారీ భూకుంభకోణం జరిగిందంటూ జీవో జారీ అయింది. అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ కొత్త జీవో జారీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సిట్‌ విశాఖలో భూ కుంభకోణాలు నిజమేనని తేల్చింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, మరో 49 మంది అధికారులు, 50 మంది ప్రైవేటు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరింది. గత ఏడాది జనవరిలోనే సర్కారుకు సిట్‌ నివేదిక అందింది. రాజకీయ నేతలే కాకుండా విశాఖలో డీఆర్‌వోలు, ఆర్డీవోలుగా పనిచేసిన 13 మంది డిప్యూటీ కలెక్టర్లపై క్రిమినల్‌ చర్యలతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిట్‌ గతంలో సిఫారసు చేసింది. తహసిల్దార్‌, డిప్యూటీ తహసిల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సర్వేయర్‌, వీఆర్వో, డిప్యూటీ సబ్‌ రిజిస్ట్రార్‌ కేడర్‌లో ఉన్న 49 మంది రెవెన్యూ అధికారులపై కూడా సిట్‌ క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేసింది.

తాజాగా జగన్‌ ప్రభుత్వం మళ్లీ సిట్‌ను ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. సిట్‌ నివేదికపై రీ ఇన్వెస్ట్‌గేషన్‌ జరుపుతామని ఎన్నికలకు ముందు జగన్‌ ప్రకటన చేయగా.. దాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags

Next Story