కచ్చులూరులో మునిగిన బోటు మరో గంటలో..

వశిష్ట బోటు గోదారిలో మునిగిపోయి నెల రోజులైంది. ఇంత వరకు జాడ లేదు. ఆపరేషన్ వశిష్ట పేరుతో బోటు వెలికితీత పనులు చేపట్టినా.. ఆదిలోనే హంసపాదులా అన్నీ ఆటంకాలే. చిక్కినట్టే చిక్కుతుంది అంటున్నారు అంతలోనే ఆపరేషన్ ఫెయిల్ అవుతోంది అంటున్నారు. ధర్మాడి సత్యం టీమ్ మూడు రోజులుగా బోటును బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బలమైన రోప్‌ల సాయంతో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా అంతలోనే నీరుగారిపోతున్నాయి. మరో రెండు రోజులు ప్రయత్నిస్తే బోటు బయటకు వస్తుందని అంచనా వేస్తున్నారు. గత నెల 15న బోల్తా పడిన బోటు ప్రమాదంలో 41 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గజ ఈతగాడైన ధర్మాడి సత్యం బృందం బుధవారం నుంచి పొక్లెయిన్, భారీ లంగరు, 3వేల అడుగుల ఇనుప రోప్‌తో బోటు వెలికితీత పనులు కొనసాగిస్తున్నారు. కానీ అంతలోనే ఆపరేషన్ వశిష్టకు బ్రేకులు పడ్డాయి.
గురువారం రోజు బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా ఆపేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఉదయం నదిలోకి వెళ్లి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న బృందానికి ఈ ఆదేశాలు అందాయి. అయితే అధికారులు బోటును వెలికి తీసేందుకు కాకినాడ నుంచి సాహసవీరుడు శివ నాయకత్వంలో ఉన్న మరో బృందాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో కచ్చులూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఇంతకీ అధికారులు ఆపరేషన్ వశిష్టను ఎందుకు ఆపేశారు. మరో బృందాన్ని ఎందుకు తీసుకువచ్చారు అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మరోవైపు శుక్రవారం బోటును బయటకు లాగేందుకు వచ్చిన శివ బృందం.. లంగర్లు బోటుకు చిక్కాయని చెబుతున్నారు. ప్రస్తుతం బోటు 50 అడుగుల లోతులో ఉందని.. సాయంత్రానికల్లా బయటకు తీస్తామని ధీమాగా చెబుతున్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com