శుక్రవారం మధ్యాహ్నంలోగా బోటు బయటకు వచ్చే అవకాశం!

శుక్రవారం మధ్యాహ్నంలోగా  బోటు బయటకు వచ్చే అవకాశం!
X

నిన్నటి వరకు సన్నగిల్లిన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట సక్సెస్‌ దిశగా సాగుతోంది. నదీ గర్భంలో చిక్కుకుపోయిన బోటును బయటకు తీసే పనిలో సత్యం టీమ్‌ తమ ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తోంది. శుక్రవారం బోటు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఆశలు చిగురిస్తున్నాయి.. నెల రోజుల క్రితం పర్యాటకులతో గోదావరిలో మునిగిన బోటు జాడ ఎట్టకేలకు తెలిసింది. వెలికి తీయడం ఇక అసాధ్యం అనుకుంటున్న సమయంలో ఆచూకీ తెలిసింది. గత కొన్ని రోజులుగా ధర్మాడి సత్యం టీమ్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చినట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బోటు 70 నుంచి 100 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో మునిగిన ప్రాంతం నుంచి కాస్త ముందుకు కొట్టుకొచ్చినట్లు తేల్చారు.

మూడో ప్రయత్నంలో బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి.. జారిపోవడంతో మరింత పకడ్బందీగా ఆపరేషన్ కొనసాగించారు. పడవ ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్టు గుర్తించారు. బోటు ఉన్నచోట 3 లంగర్లు వదిలి గాలించారు. ఈ ప్రయత్నాలు ఫలించి ఓ లంగరు బోటు రెయిలింగ్‌కు చిక్కుకుంది. అయితే దాన్ని పైకిలాగే క్రమంలో లంగర్‌తోపాటు బోటు రెయిలింగ్ కూడా ఊడివచ్చింది. దీంతో మరోసారి నిరాశే ఎదురైంది. అయితే బోటు ఉన్న ప్రాంతాన్ని మాత్రం కచ్చితంగా గుర్తించగలిగారు. దీంతో బోటును మరో రెండు రోజుల్లో కచ్చితంగా బయటకు తీస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ధర్మాడి సత్యం బృందం. అటు గాలింపు చర్యలను కాకినాడ పోర్ట్ అధికారులు పర్యవేక్షించారు.

ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి బాగా తగ్గింది. సహాయ చర్యలకు అనుకూల వాతావరణం ఉంది. పడవను పైకి తీసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది సత్యం టీమ్‌. సెర్చ్ ఆపరేషన్లో భారీ లంగర్లతోపాటు 3 వేల అడుగుల ఇనుప తాడు, వెయ్యి మీటర్ల నైలాన్ తాడును వాడుతున్నారు. బుధవారం గాలింపు కొనసాగిస్తున్నప్పుడు లంగరుకు చిక్కినట్టే చిక్కి మిస్సయినా.. ఆ సమయంలో నీళ్లపై తెల్లని రంగు తేలింది. లంగరుకు బోటు తగులుకున్న కారణంగా పెయింట్ ఊడటంతో ఆ రంగు నీటిపైకితేలింది. దీంతో గురువారం అదే ప్రాతంలో ఫోకస్ చేసి లంగర్లను నీటిలోకి వదిలారు. ఈ క్రమంలో లంగరుకు బోటు రెయిలింగ్‌ చిక్కింది.. పొక్లెయిన్‌తో ఐరన్‌ రోప్‌ను బలంగా లాగడంతో బోటు రెయిలింగ్‌ ఊడి వచ్చింది. ఒడ్డుకు చేర్చిన రెయిలింగ్‌ను అధికారులు పరిశీలించారు. దీంతో సత్యం బృందానికి బోటు వెలికితీయగలమన్న నమ్మకం మరింత బలపడింది. ప్రస్తుతం 70 అడుగు లోతులో బోటు ఉన్నట్లుగా సత్యం టీమ్‌ అంచనా వేస్తోంది. దీంతో తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నంలోగా బోటును వెలికితీసే అవకాశం ఉందని సత్యం బృందంతోపాటు అధికారులు కూడా భావిస్తున్నారు. ఒకవేళ బోటు లంగర్‌కు చిక్కకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించనున్నారు.

Tags

Next Story