సామాన్యులకు గూడు కరువైంది

సామాన్యులకు గూడు కరువైంది
X

సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల.. అమరావతి రాజధాని అయ్యాక విజయవాడకు ప్రాధాన్యం పెరిగిపోయింది.. దీంతో గజం స్థలం కూడా బంగారం కంటే ప్రియంగా మారిపోయింది. భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులకు గూడు కరువైంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని నెరవేర్చేందుకు లబ్ధిదారుల నుంచి కొంత డబ్బును కట్టించుకుని.. మిగిలిన నిధులను ప్రభుత్వమే భరించేలా ప్లాన్‌ చేసింది. ఇళ్లు వస్తాయన్న ఆశతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు గతంలో డబ్బు కట్టారు. అయితే, గత ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో సీన్‌ రివర్స్‌ అయింది. ఇళ్లు కాదు కదా.. కనీసం కట్టిన డబ్బు తిరిగి వస్తుందో రాదోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు లబ్ధిదారులు. కానీ, అధికారుల నుంచి మాత్రం సమాధానం రావడం లేదు.

ప్రజల దగ్గర్నుంచి డబ్బు వసూలు చేసిన అధికారులు ఏడాది దాటినా ఇప్పటి వరకు ఇళ్ల కేటాయింపు చేయలేదని లబ్ధిదారులు ఫైరవుతున్నారు. అనేక వ్యయ ప్రయాసాలను తట్టుకుని డబ్బు కట్టామని.. తమకు ఇళ్లు కేటాయించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఏడాదిలో అనేకసార్లు అధికారులను కలిసి తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని అధికారులు మొక్కుబడిగా సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదుపాయాలు లేకపోయినా తాము వెళ్లిపోతామని చెబుతున్నా తమ గోడు వినిపించుకునే నాథుడు లేడంటున్నారు. మరోవైపు ఇళ్ల గందరగోళంపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనబడుతోంది.

Tags

Next Story