చిగురించిన ఆశలు.. కచ్చులూరు బోటు ముందుకు కదిలింది..

చిగురించిన ఆశలు.. కచ్చులూరు బోటు ముందుకు కదిలింది..
X

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం నాలుగు రోజులుగా పడవను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెండో రోజు లంగరుకు బలమైన వస్తువుకు తగిలింది. మూడో రోజు లంగరుకు బోటు రెయిలింగ్ చిక్కినా.. పైకి లాగే క్రమంలో ఊడిపోయింది. నాలుగో రోజైన శుక్రవారం కూడా లంగర్లు వదులు కావడంతో బోటు కొద్దిదూరం మాత్రమే ముందుకు కదిలింది. మొత్తానికి బోటు ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించడంతో ఆశలు చిగురించాయి. గోదావరిలో బోటు కేవలం 50 అడుగుల లోతులోనే ఉన్నట్లు ధర్మాడి సత్యం చెబుతున్నారు. ఒడ్డు నుంచి కూడా కేవలం 200 మీటర్ల దూరంలోపే ఉండటంతో..కచ్చితంగా బయటకు తీస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

బోటు దాదాపు 25 టన్నులకు పైగా బరువు ఉంటుంది. రెయిలింగ్ అంత బరువును లాగలేదు. బోటుకు ఉన్న ఐరన్ కమ్మెలు లేదా కింద వైపు ఫ్యాన్ సమీపంలో ఉండే ఇనుప రాడ్లకు లంగర్ తగిలితేనే పడవ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా జరగాలంటే..నదిలోకి గజ ఈతగాళ్లను పంపాల్సి ఉంటుంది. అయితే ఇది కొంచెం రిస్కుతో కూడుకున్న పని. దీనికి అధికారుల అనుమతి కూడా అవసరం ఉంటుంది.. అందుకే ప్రస్తుతానికి..బోటు ఉన్న ప్రాంతంలోనే లంగర్లు వేసి బయటకు లాగేందుకు ట్రై చేస్తున్నారు.. అయితే ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతే శనివారం కొంత మంది గజ ఈతగాళ్లను ఆక్సీజన్ సిలిండర్ల సాయంతో నదిలోకి పంపే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది... అటు స్థానిక మత్యకారులు కూడా సెర్చ్‌ఆపరేషన్‌లో సాయపడుతున్నారు..

సెర్చ్‌ ఆపరేష్‌ను కాకినాడ పోర్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.. కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. గతనెల 15న 77 మంది పర్యాటకులతో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయింది.. ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా.. మరో 13 మృతదేహాల ఆచూకీ గల్లంతయ్యింది. ఇవి బోటులోనే చిక్కుకొని ఉంటాయని భావిస్తున్నారు.. అటు పడవను బయటకు లాగితే చనిపోయిన వారి సంఖ్యపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Next Story