కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ఫ్యాక్టరీలు

కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ఫ్యాక్టరీలు
X

కొందరి నిర్లక్ష్యం మరికొందరి ప్రాణాల మీదకు తెస్తోంది. బాణసంచా ఫ్యాక్టరీలు కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. గత నెల 30న జరిగిన ప్రమాదాన్ని మర్చిపోక ముందే తూర్పు గోదావరి జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. అందులో పనిచేసే పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

రామాలయంపేటకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు సహా పది మంది ఇక్కడ పనిచేస్తున్నారు. రోజూలాగే బాణసంచా తయారు చేసేందుకు పనిలోకి వచ్చారు కార్మికులు. చిచ్చుబుడ్డిలో మందుగుండు కూరుతుండగా మోతాదు ఎక్కువ కావడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆంజనేయులు కుటుంబ సభ్యులతోపాటు పనిచేస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి.

దీపావళి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకపోగా, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో పనుల కోసం వెళ్లే సామాన్యులు సమిధలవుతున్నారు. నిబంధనలు పాటించని బాణసంచా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Next Story