హాట్ హాట్‌గా జనసేన పొలిట్ బ్యూరో సమావేశం

జనసేన పొలిట్ బ్యూరో సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల స్థితిగతులు, జాతీయ స్థాయి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, తెలంగాణలో యురేనియం తవ్వకాలు, ప్రభుత్వాల పాలనపైనా జనసేనాని పార్టీ నేతలతో చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు వ్యూహాలను పవన్ కల్యాణ్ సమావేశంలో వివరించారు. త్వరలో జరగబోయే అన్ని రకాల ఎన్నికల్లో పోటీకి దిగాలని పార్టీ నేతలకు జనసేనాని సూచించారు. రెండు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు గుర్తించి వాటి కోసం వివిధ రూపాల్లో పోరాటాలను ఖరారు చేసుకోవాలన్నారు. అలాగే ఇటీవల కొందరు నేతలు జనసేనను వీడటంతో అప్రమత్తంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సీనియర్లను కాపాడుకునేందుకు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే ప్రతిపాదన పొలిట్ బ్యూరో సమావేశంలో వచ్చింది.
ఇక ఏపీలో వివిధ పథకాల అమలు, రైతులకు అమలు చేస్తున్న పథకాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో నేతలు చర్చించారు. రాష్ట్రంలో జగన్ పాలనపై ఫీడ్ బ్యాక్‌ను పవన్ కల్యాణ్ నేతలను అడిగి తెలుసుకున్నారు. కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణ రంగాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇసుక లేక 35 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏపీని శాశ్వత రాజధానిలేని రాష్ట్రంగా నిలబెట్టారని, రాజధాని ప్రాంత అన్వేషణ, నిపుణుల కమిటీ పరిశీలన అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అంశంలో బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ ఫైరయ్యారు.
మరోవైపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలో యూరేనియం తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భవిష్యత్ పోరాట వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. అదే విధంగా ఎన్‌ఆర్‌సీ, రామజన్మభూమి అంశంతోపాటు అధికార పక్ష నేతల అవినీతి, అక్రమాలపై దృష్టిసారించాలనే చర్చ శుక్రవారం సమావేశంలో జరిగింది. అలాగే తెంలగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించింది జనసేన. ఇక పొలిట్ బ్యూరో సమావేశానికి నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్‌రావు, అర్హంఖాన్ మినహా మిగతా సీనియర్లలో చాలా మంది గైర్హాజరవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. యూరప్ పర్యటనలో ఉండటంతో సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు రాజు రవితేజ సమాచారం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com