బోటు వెలికితీత పనులకు మళ్లీ బ్రేక్‌

బోటు వెలికితీత పనులకు మళ్లీ బ్రేక్‌
X

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది. నిన్న వేసిన లంగర్లు, బోటుకు తగలకపోవడంతో నిరాశ చెందిన ధర్మాడి సత్యం బృందంపనులను తాత్కాలికంగా ఆపేసింది. అటు.. గజ ఈతగాళ్లను తీసుకొచ్చేందుకు ధర్మాడి సత్యం విశాఖ వెళ్లారు. గజ ఈతగాళ్లను నదీ గర్భంలోకి పంపి.. రాయల్‌ వశిష్ట బోటుకు లంగరు వేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.

గోదావరిలో 50 అడుగుల లోతులో ఒడ్డుకు దాదాపు 8 వందల మీటర్ల దూరంలో బోటు ఉన్నట్టు గుర్తించారు. నిన్న ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నంలో బోటు 75 అడుగులు ముందుకు వచ్చింది. బోటులో మరికొన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఐదు రోజులుగా పడవను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలుచేస్తోంది. రెండో రోజు లంగరుకు బలమైన వస్తువుకు తగిలింది. మూడో రోజు లంగరుకు బోటు రెయిలింగ్ చిక్కినా.. పైకి లాగే క్రమంలో ఊడిపోయింది. నాలుగో రోజు కూడా లంగర్లు వదులు కావడంతో బోటు కేవలం 75 అడుగులు మాత్రమే ముందుకు కదిలింది. రెండు సార్లు ఇనుప రోప్‌లు తెగిపోయాయి.

మొత్తానికి బోటు ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించడంతో ఆశలు చిగురిస్తున్నాయి. తమ ఆప్తులు మృతదేహాలు బోటు చిక్కుకుని ఉండే ఉంటాయని బాధితులు బంధువులు ఎదురుచూస్తున్నారు. బోటు దాదాపు 25 టన్నులకు పైగా బరువు ఉంటుంది. రెయిలింగ్ అంత బరువును లాగలేదు. బోటుకు ఉన్న ఐరన్ కమ్మెలు లేదా కింద వైపు ఫ్యాన్ సమీపంలో ఉండే ఇనుప రాడ్లకు లంగర్ తగిలితేనే పడవ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా జరగాలంటే..నదిలోకి గజ ఈతగాళ్లను పంపాల్సి ఉంటుంది.

సెర్చ్‌ ఆపరేష్‌ను కాకినాడ పోర్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. గతనెల 15న 77 మంది పర్యాటకులతో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా.. మరో 13 మృతదేహాల ఆచూకీ లభించలేదు. ఇవి బోటులోనే చిక్కుకొని ఉంటాయని భావిస్తున్నారు. బోటును బయటకు లాగితేనే చనిపోయిన వారి సంఖ్య పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story