ఎమోషనల్ అయిన నందమూరి బాలకృష్ణ

ఎప్పుడు చలాకీగా ఉండే నందమూరి నటసింహం బాలకృష్ణ.. విషణ్ణవదనంలో మునిగిపోయారు. తనను అమితంగా అభిమానించే చిన్నారి అభిమాని గోకుల్.. డెంగ్యూ కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమంలో అచ్చంగా బాలకృష్ణలా గోకుల్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అంతలా బాలకృష్ణను మరిపిస్తాడు గోకుల్.. బాలయ్య సైతం చిన్నారి నటనకు ఫిదా అయ్యారు. గతంలో కుటుంబసభ్యులతో కలిసి
బాలయ్య ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. అటువంటి అభిమాని డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. తన చిన్నారి అభిమాని ఇక లేడన్న విషయాన్నీ బాలయ్య జీర్ణించుకోలేక పోయారు.
చిన్నారి మృతికి బాలయ్య సంతాపం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు..'మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.' అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com