తెలంగాణ బంద్ ప్రశాంతం.. కీలక నేతల అరెస్ట్..

తెలంగాణ బంద్ ప్రశాంతం.. కీలక నేతల అరెస్ట్..
X

తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమండ్‌తో జేఏసీ ఇచ్చిన బంద్‌కు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు జిల్లాల్లోని డిపోలు, బస్టాండ్‌ల ఎదుట ఆందోళనలకు దిగిన ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు..

హైదరాబాద్‌లో ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన నేతలను అరెస్ట్ చేశారు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం.., తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతోపాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలను అదుపులోకి తీసుకున్నారు..

ఆర్టీసీ జేఏసీ బంద్‌కు మద్దతుగా అబిడ్స్‌లో ఆందోళనకు దిగిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. . ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు లక్ష్మణ్‌. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

వామపక్షాలు,న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ దర్నా నిర్వహించారు. ఆర్టీసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు...అటు MRPS ఆధ్వర్యంలోనూ ఆందోళనలు చేపట్టారు.. నిరసనకారులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగిందన్నారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. బంద్‌కి మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పోరాటాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్‌ చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అరెస్టు చేసిన వాళ్లందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

Tags

Next Story