వారిని కూల్ చేయడానికే బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ సమావేశం - విపక్షాలు

వారిని కూల్ చేయడానికే బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ సమావేశం - విపక్షాలు
X

ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.. మోదీ అదే చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి డబుల్ సెంచరీ సాధించడం ఖాయమని కమలనాథులు చెప్తున్నా.. అందుకు ఏ చిన్న అవకాశం చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ సమావేశాన్ని విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ముంబైకర్లు, మహారాష్ట్ర వాసుల మనసు దోచుకునే ప్రయత్నాల్లో భాగమని విమర్శిస్తున్నారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో బిజీగా కనిపించిన ప్రధానమంత్రి మోదీ.. ప్రచారం ముగియగానే బాలీవుడ్‌ ప్రముఖులందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి షారుక్‌ ఖాన్, అమీర్‌ఖాన్‌తో పాటు ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. బాపూజీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు గొప్పగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఒకేసారి వాడే ప్లాస్టిక్‌ నిషేధంపై మద్దతు తెలిపినందుకు అమీర్‌‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

అయితే.. ఈమధ్య వివిధ రంగాలకు చెందిన 49 మంది సెలబ్రిటీ మేధావులపై బీహార్‌లో దేశద్రోహం కేసు నమోదు అవడం రాజకీయంగా రచ్చ రాజేసింది. గత ఎన్నికల ముందు వాళ్లంతా మోదీ విధానాలను తప్పుపడుతూ బహిరంగ లేఖ రాశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టేలా లేఖ రాశారంటూ.. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లగా.. ఏకంగా దేశద్రోహం కేసు నమోదైంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. అధికార యంత్రాంగం వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ప్రముఖులను కూల్‌ చేయడమే మోదీ శనివారం భేటీ సారాంశమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags

Next Story