నేను తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదు : చంద్రబాబు

పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి కేడర్‌కు దిశానిర్దేశం చేసిన ఆయన.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లకే టీడీపీ పరిమితమైంది. నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయలోపం బయటపడింది. దీంతో జిల్లాలో పటిష్టతపై ఫోకస్ చేసిన చంద్రబాబు.. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఓటమి గురించి ఎవరూ బాధపడొద్దని.. మళ్లీ పుంజుకుంటామని.. ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.
తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నవరత్నాలు నవ గ్రహాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు.. పేదవాడి కడుపునింపే అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశారని టీడీపీ అధినేత ప్రశ్నించారు. ఇసుకాసురులు ఊరికి ఒకడు తయారయ్యారని మండిపడ్డారు. లక్షలాది మంది ఇసుక అందక పస్తులు ఉంటున్నారని.. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన. అటు.. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్తు నిర్మాణంపై పలు సూచనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com