హుజూర్‌ నగర్‌లో భారీగా పోలింగ్‌.. 85 శాతం పైగానే..

హుజూర్‌ నగర్‌లో భారీగా పోలింగ్‌.. 85 శాతం పైగానే..

హుజూర్‌ నగర్‌లో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఇప్పటికే 85 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు తెలుస్తోంది. ఇంకా చాలామంది క్యూ లైన్లలో ఉండడంతో 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు పోలింగ్‌ ప్రశాంతంగానే ముగిసింది. దీంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు అధికారులు..

అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. గరిడేపల్లి మండలం, కల్మలచెరువు గ్రామం పోలింగ్‌ స్టేషన్‌లో హై డ్రామా కనిపించింది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి పోలింగ్‌బూత్‌లను సందర్శించడానికి వెళ్లడంతో.. ఆయన్ను స్థానిక ఎస్సై అడ్డుకున్నారు.

స్థానిక నేతలు ఎవరినీ లోపలకు అనుమతించేది లేదని ఆ ఎస్సై స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన సైదిరెడ్డి.. ఎస్సైపై మండిపడ్డారు. ఓవర్‌యాక్షన్‌ వద్దని.. తాను టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని అని చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సైదిరెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఇక చింతలపాలెం కిష్టాపురం పోలీంగ్‌ స్టేషన్‌ దగ్గరా హైడ్రామా నడిచింది. పోలింగ్‌‌ సరలిని తెలుసుకునేందుకు వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిని టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉత్తమ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వారికి ధీటుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది..

హుజూర్‌నగర్‌ మండలం గోపాలపురం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 195లో వివాదం చెలరేగింది. ఓ వృద్ధుడు ఓటే వేసే విషయంలో కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ ఏజెంట్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story