3 గంటల వరకూ 33 శాతమే పోలింగ్..

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు జనం. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ జోరుగా సాగుతుండగా... పట్టణ ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. ముఖ్యంగా ముంబై, పుణె, నాగపూర్‌లాంటి మహానగరాల్లో ఇప్పటి వరకు పోలింగ్ 30 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.
ఎప్పట్లాగే ఈవీఎంల మొరాయింపు తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు పని చేస్తే.. వీవీ ప్యాట్లు పనిచేయలేదు. తొలిసారిగా మహారాష్ట్ర ఎన్నికల్లో వీవీ ప్యాట్లను వినియోగించడంతో సరైన అవగాహన లేక కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తాయి.
రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులు ఓటేశారు. ఉదయాన్నే తమ దగ్గర్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందేశాన్నిచ్చారు. ముంబైలో సీఎం ఫడ్నవీస్, శివసేన చీప్ ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ నేత శరద్ పవార్, MNS చీఫ్ రాజ్ థాక్రే, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, బారామతిలో సుప్రీయా సూలే, నాగపూర్‌లో మోహన్ భగవత్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా.... అటు సచిన్ టెండూల్కర్, మహేష్ భూపతితో పాటు అమీర్ ఖాన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటా, రితేష్ దేష్ ముఖ్, జేనీలియా, అనుపమ్ ఖేర్, లారా దత్తాతో పాటు పలువురు బాలీవుడ్ నటులు ఓటేశారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా.. 90 వేల 403 పోలింగ్ బూతుల్లో 8 కోట్ల 95 లక్షల 62 వేల 706 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 3 వేల 237 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com