100 శాతం బస్సులు రోడ్ల మీదకు : మంత్రి పువ్వాడ

100 శాతం బస్సులు రోడ్ల మీదకు : మంత్రి పువ్వాడ

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు.. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, వేతనాలు లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్లు సమ్మె విరమించేలా గవర్నర్ చొరవ తీసుకున్నారు. అలాగే తమ సమస్యను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేతలు. వారం రోజుల్లో జేఏసీ నేతలు గవర్నర్‌ను కలవడం ఇది రెండోసారి..

ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి.. పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో 100 శాతం బస్సులు రోడ్ల మీదకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేసేలా, వారి బస్‌ పాసులు ఆమోదించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎలక్ట్రీషీయన్లు నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు మంత్రి.

కార్మికుల వేతనాల చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. జీతాల కోసం 230 కోట్లు అవసరమని.. ప్రస్తుతం తమ వద్ద 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని వివరించింది. కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొంది. ఇరు పక్షాలు వాదనలు విన్న న్యాయస్థానం..తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయస్థానం ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణ చేపడతామని వెల్లడించింది.

Tags

Next Story