కార్మికుడి అతితెలివి.. విశాఖ స్టీల్ ప్లాంట్లో దొంగతనం ఎలా చేశాడో..

దొంగతనంలో ఓ దొంగ అతితెలివి ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గతకొద్ది రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంటులో దొంగలు విజృంభిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ప్లాంటులోని విలువైన సొత్తును చాకచక్యంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటి దొంగ అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంటులో కోక్ ఓవెన్ ఐదో బ్యాటరీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు (49) సాయంత్రం 7 గంటల సమయంలో విధులు ముగించుకొని నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. బీసీ గేటు వద్ద అతన్ని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీ చేసింది.. అతని నడుము బాగా లావుగా ఉండటం చూసి అనుమానం వచ్చింది.
దాంతో అతగాడిని తనిఖీ చేయగా ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టి ఉండటాన్ని చూసి సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. మాములుగా ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి చోరీ సొత్తును బయటకు విసరడం, బైకు ట్యాంకు కింద సొత్తును తరలించడం వంటి దొంగతనాలను పోలీసులు తెలుసుకుంటున్నారని.. ఈ దొంగ మేధావి వెరైటీగా ప్లాన్ చేయడం చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఈ టైపు దొంగతనాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయో.. ఎంత సొత్తు దొంగలపాలైందో అని స్టీల్ ప్లాంట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com