నేడే చారిత్రాత్మక విజయం

నేడే చారిత్రాత్మక విజయం

సౌతాఫ్రికాపై ఎప్పుడూలేని విధంగా 3–0తో క్లీన్‌స్వీప్‌ విజయానికి టీమిండియా రెండే అడుగుల దూరంలో ఉంది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లతో ఘనచరితకు శ్రీకారం చుట్టింది. భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. చారిత్రక విజయానికి భారత్‌ను దగ్గర చేశారు. తొలి సెషన్‌లో పేసర్లు ఉమేశ్‌, షమీలకు స్పిన్నర్లు జడేజా, నదీమ్‌ తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌ 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో హబ్జా ఒక్కడే భారత బౌలర్లకు ఎదురు నిలిచాడు..

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలోఆన్‌ తప్పలేదు. అయితే వారి రెండో ఇన్నింగ్స్‌ కూడా కష్టాలతోనే మొదలైంది. ఫాలో ఆన్‌లో భారత పేసర్లు మరింత రెచ్చిపోయారు. ఆటనిలిచే సమయానికి 132 పరుగులకే 8 వికెట్లను పడేశారు. 10 పరుగులే ఇచ్చిన షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రిటైర్డ్‌హర్ట్‌ ఎల్గర్‌ మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అంతా 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు. డికాక్‌ ను ఉమేశ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్న హమ్జాకు షమీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదే ఊపులో కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఎల్బీ చేశాడు. దీంతో మూడో సెషన్‌కు ముందే సౌతాఫ్రికా 4 కీలక వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్‌ తర్వాత కూడా పర్యాటక జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లిండే, పీట్‌ నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్‌ అజేయంగా నిలిచాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు ఉండటంతో మరో అరగంటసేపు ఆటను పొడిగించారు. కానీ బ్రుయిన్‌.. నోర్జే తో కలిసి నాటౌట్‌గా నిలవడంతో ఆట మరో రోజు కొనసాగాల్సి వచ్చింది.

దూకుడు మీదున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయంతో గ్రౌండ్‌ వీడాడు. మూడో రోజు ఆటలో అశ్విన్‌ వేసిన 27వ ఓవర్‌ తొలి బంతి గింగిర్లు తిరుగుతూ బౌన్స్‌ అయింది. క్రీజులో ఉన్న లిండే దాన్ని ఎదుర్కోలేకపోవడంతో బంతిని సాహా అందుకునే ప్రయత్నం చేయగా అతని మునివేళ్లను తాకడంతో గాయపడ్డాడు. నొప్పికి తాళలేకపోయిన సాహా పెవిలియన్‌ చేరగా అతని స్థానంలో రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ చేయాల్సి వచ్చింది. మొత్తంగా విజయానికి రెండే అడుగుల దూరంలో నిలిచిన కోహ్లీసేన అది కూడా తొలి సెషన్లోనే ముగించి విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story