కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

కేంద్రహోంమంత్రి అమిత్ షాతో.. ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం వైఎస్ జగన్, అమిత్‌షాతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై సీఎం వైఎస్ జగన్ అమిత్ షాతో చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు , సేవా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. ఆదాయంలో ఈ రంగాల వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని అమిత్ షాకి సీఎం వైఎస్ జగన్ వివరించారు.
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా సీఎం ప్రస్తావించారు. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు.
ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ. 400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్, కలహండి ప్రాంతాలకు తలసరి రూ. 4000 ఇస్తున్నారని చెప్పారు. అదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలన్నారు. ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఇప్పటివరకూ రూ. 2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 1050 కోట్లుమాత్రమే ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కు ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ. 5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com