ఆపరేషన్ రాయల్ వశిష్ట బోటు.. పార్టు పార్టులుగా బయటకు

గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు పార్టు పార్టులుగా బయటకు వస్తోంది. మొన్న రెయిలింగ్ రాగా.. ఇప్పుడు పైభాగం ఊడి వచ్చింది. ప్రస్తుతం పడవ 40 అడుగుల లోతులోనే ఉన్నప్పటికీ.. విపరీతమైన బరువు, ఇసుకలో కూరుకుపోయి ఉండటం వల్ల ఎంతకూ కదలడం లేదు. విశాఖ నుంచి డైవర్లను పిలిపించి ప్రయత్నించినా మరోసారి చిక్కినట్లే చిక్కి జారిపోయింది. దీంతో ఈరోజు కూడా ఆపరేషన్ కొనసాగనుంది.
పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసే ఆపరేషన్ కొనసాగుతోంది. ధర్మాడి సత్యం బృందం, విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ వాటర్ మెరైన్ డైవర్లు మట్టి, బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోటు ముందు భాగం 30 అడుగులు, వెనుక భాగం నది వైపు 50 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి నిన్నటితోనే ఆపరేషన్ ముగుస్తుందని అంతా భావించారు.. వాతావరణం అనుకూలంగా ఉండటంతో సులభంగానే బోటును బయటకు తీయవచ్చని అనుకున్నారు.. విశాఖ నుంచి వచ్చిన డైవర్స్ నది అడుగు భాగంలోకి వెళ్లి.. పడవకు రోప్‌లు బిగించి వచ్చారు. పైకి లాగుతున్న క్రమంలో ఆ బరువును రోప్‌లు తట్టుకోలేకపోయాయి. దీంతో పడవ పైభాగం, డ్రైవర్ కేబిన్‌లోని స్టీరింగ్, గేర్ రాడ్, ఇనుప రెయిలింగ్ బయటకు వచ్చాయి. బోటు ఏటవాలుగా మునిగిపోయి ఉండటంతోనే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


