గోదావరి ఒడ్డుకు రాయల్‌ వశిష్ట బోటు.. ఏడు మృతదేహాల వెలికితీత

గోదావరి ఒడ్డుకు రాయల్‌ వశిష్ట బోటు.. ఏడు మృతదేహాల వెలికితీత
X

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత రాయల్‌ వశిష్ట బోటును ఒడ్డుకు చేర్చారు. గత కొన్ని రోజులుగా చిక్కినట్టే చిక్కి చేజారిపోతున్న బోటు.. ఎట్టకేలకు బయటకు రావడంతో.. అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. 40 అడుగుల లోతులో ఉన్న బోటును లంగర్లు.. ఐరన్‌ రోపుల సాయంతో ధర్మాడి సత్యం బృందం నీటి బయటకు తీసుకొచ్చింది. తరువాత అక్కడ నుంచి బోటును పూర్తిగా గోదావరి ఒడ్డుకు చేర్చారు.

గతనెల 15న విహారయాత్రకు పర్యాటకులతో వెళ్తున్న వశిష్టబోటు.. కచ్చులూరి దగ్గర గోదావరిలో మునిగిపోయింది. పడవలో మొత్తం 77 మంది ఉండగా.. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 39 మంది మృతి చెందారు.. బోటు నీటిపైకి రావడంతోనే మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. బోటు గదుల డోర్లు ఓపెన్‌ చేసి.. మృత దేహాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటికి ఏడు మృతదేహాలను బయటకు తీశారు. మొన్న బోటులోంచి ఒక తల లేని మృతదేహం బయటకి వచ్చింది.

38 రోజుల సుదీర్ఘ ప్రయత్నాల తరువాత పార్టు పార్టులుగా ధ్వంసమైన బోటు ఎట్టకేలకు బయటకు వచ్చింది. బోటు నీటిలో మునిగిన తరువాత.. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో.. బురద, ఇసుక భారీగా బోటులోకి చేరింది. నీరు కూడా ఎక్కువగా చేరడంతో బోటు పూర్తిగా బరువెక్కింది. దీంతోనే బోటును బయటకు తీయడం ఇంత కష్టమైందని ధర్మాడి సంత్యం బృందం చెబుతోంది.

Tags

Next Story