టీటీడీలో శ్రీవాణి పథకం.. శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే..

టీటీడీలో శ్రీవాణి పథకం.. శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే..

శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఓ వైపు నిధులు సమకూర్చుకుంటూనే... మరోవైపు దళారి వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు.. శ్రీవాణి పథకంతో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకానికి... పదివేలు విరాళం ఇస్తే.. వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్ట్‌ అందించనుంది టీటీడీ. ఇందుకోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. నవంబర్‌ తొలివారంలో శ్రీవాణి ట్రస్ట్‌ పథకానికి సంబంధించి.. యాప్‌ను అందుబాటులో తీసుకురానున్నారు. మొదటి 15 రోజులు పాటు తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌ విధానంలో టికెట్లను అందిస్తారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి..

విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్‌ పరిధిలో పరిగణిస్తూ.. శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. విరాళంగా పదివేలు చెల్లించడటంతో.. టికెట్‌ను 500తో కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు తెలపారు. ఒక నెల ముందుగానే కోటాను విడుదల చేస్తామని తెలిపింది టీటీడీ. ఈ సేవకు వచ్చే నిధులను రాష్ట్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి వెచ్చించనున్నారు.

ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానం 9 ట్రస్టులను నిర్వహిస్తోంది. అన్నప్రసాదం, ప్రాణాదానం, గోసంరక్షణ, వేదపరిరక్షణ, బర్డ్, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, బాలామందిర్, విద్యాదానం లాంటి ట్రస్టులను నిర్వహిస్తోంది. వీటికి లక్ష రూపాయలు విరాళంగా సమర్పించిన భక్తుడికి ప్రతి ఏటా దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది..

నిజానికి...తిరుమల కొండపై దళారీ వ్యవస్థను పూర్తిగా అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం వి.ఐ.పి బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు లేకుండా ఇతరులను ఆశ్రయించే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే శ్రీవాణి ట్రస్టుని తెరపైకి తీసుకువచ్చింది టీటీడీ. ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధుల సేకరణ సులభతరం అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story