పాక్ పౌరుల్ని చితకబాదిన సైన్యం.. ఇద్దరు మృతి, 80 మందికి గాయాలు..

ఉగ్రశిబిరాలకు స్వర్గధామంగా నిలిచిన పీవోకేలో మరో అలజడి. పాకిస్తాన్ పై తిరుగుబాటు స్వరం అది. పాక్ పాలకులకు తలనొప్పి తెప్పించే స్వతంత్ర నినాదాలు. ఇలాంటి నినాదాలు, స్వాతంత్ర పోరాటాలు ఇక్కడ కొత్తేమి కాదు. ప్రతీ ఏటా అక్టోబర్ 22న ఇలాంటి ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి. అయితే..ఈ సారి మాత్రం పాక్ కు చెమటలు పట్టినంత పని అయ్యింది. పీవోకేలోని వివిధ రాజకీయ పార్టీల కూటమి ఆల్ ఇండిపెండెంట్ పార్టీస్ అలయెన్స్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. పాక్ పెత్తనం నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు చేశారు. ముజఫరాబాద్ కేంద్రంగా మొదలైన పోరాటం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వేలాదిమంది ప్రజలు ముజఫరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
పీవోకేలో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తున్న సమయంలో ర్యాలీలు, ఆందోళనలు జరగటాన్ని ప్రధాని ఇమ్రాన్ తో పాటు పీవోకే ఆర్మీకి కూడా కొద్దిగా టెన్షన్ క్రియేట్ చేసింది. దీంతో నిరసనలను అణిచివేసేందుకు కర్కషంగా వ్యవహరించింది పాక్. ప్రజా పోరాటాన్ని అణిచి వేయడానికి భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆందోళనకారులపై భద్రతా బలగాలు విరుచుకు పడ్డాయి. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అక్కడక్కడా కాల్పులు కూడా జరిగాయి. దీంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. దాదాపు 80 మందికి గాయాలయ్యాయి.
1947 అక్టోబరు 22న పాకిస్థాన్ దళాలు జమ్మూ-కశ్మీరుపై దాడి చేశాయి. ఈ దండయాత్రకు 72 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రజలు వీథుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గతేడాది ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్థాన్, రావల్పిండి, రావాల్కోట్, కోట్లీ ప్రాంతాల్లో పాక్ వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అయితే..ఈ స్వతంత్ర పోరాటాలు, నిరసనలను ముందుగానే అంచనా వేసిన పాకిస్తాన్..విదేశీ ప్రతినిధుల బృందాన్ని ముందుగా ఎంచుకున్న ప్రాంతాల్లో మాత్రమే పర్యటించేలా జాగ్రత్త పడింది. భారత్ దాడులతో సరిహద్దు భూభాగంలో హింసకు తెగబడుతోందని వారికి వివరించేందుకు తాపత్రయపడుతోంది పాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com