ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌.. పాత ఆర్టీసీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా ఈ మాట చెబుతున్నాను అన్నారు. ఆర్టీసీ యూనియన్లకు బుద్ధి, జ్ఞానం ఉండే ఈ సమ్మె చేస్తున్నారా అని ప్రశ్నించారు. సమ్మె ముగియకపోతే.. ఆర్టీసీయే ముగుస్తుందని స్పష్టం చేశారు.

ఆర్టీసీ సంఘాల గొంతెమ్మ కోర్కెలు ప్రభుత్వం తీర్చదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయమని కోరవడం అర్థం పర్థం లేని డిమాండ్‌ అన్నారు. నాలుగేళ్లలో 67 శాతం జీతాలు హైక్‌ చేస్తే ఇంకా డిమాండ్లు ఏంటని మండిపడ్డారు. ఆర్టీసీపై తనకన్నా ఎవరికీ అవగాహన లేదన్నారు కేసీఆర్‌. గతంలో తాను రవాణా శాఖ మంత్రిగా పని చేసినప్పుడు భారీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చానని గుర్తు చేశారు. కార్మికుల పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ లాభాల్లో ఉంటే.. ఆర్టీసీ నష్టాల్లో ఎందుకు ఉంటోంది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

ఆర్టీసీని చాలా రాష్ట్రాలుతీసేశాయన్నారు సీఎం కేసీఆర్‌. వెస్ట్‌ బెంగాల్‌లో కూడా ఆర్టీసీని మూసేశారని గుర్తు చేశారు. ఆర్టీసీని ముంచుకుంటున్నది యూనియన్లే అన్నారు. కేవలం యూనియన్ల ఎన్నికలకు ముందు జరిగే పనికిమాలిన సమ్మె ఇది అని కేసీఆర్‌ విమర్శించారు. ఆర్టీసీ వీలనంపై ఏపీలో కమిటీ వేశారని.. ఆ కమిటీ ఏమి చెబుతుందో చూడాలన్నారు. ఐదారు రోజుల్లో సమ్మె విషయంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఐదారు రోజుల్లో ఒక్క సంతకంతో నిర్ణయం తీసుకుంటాన పరోక్షంగా సమ్మె చేస్తున్న కార్మికులకు హెచ్చరిక చేశారు.

Tags

Read MoreRead Less
Next Story