ప్లాస్టిక్ కవర్ లేదన్న పాపానికి అతడిని..

ఉదయం లేచిన దగ్గర్నుంచి పాల పాకెట్ మొదలు.. పడుకునే వరకు ఏదో ఒకటి కొనడం జరుగుతుంటుంది. అవన్నీ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకునే ఇంటికి మోసుకుపోతుంటాము. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి. అది చాలా హానికరం అనే వార్తలు చదువుతాము.. వింటాము కానీ ఆచరణ శూన్యం. కవర్ లేకపోతే గడవదు.. వేరే బ్యాగ్ క్యారీ చేయడం తెలియదు. చర్యలు కఠినంగా ఉంటే తప్ప ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వమే ప్లాస్టిక్ నిషేధానికి పూనుకుంది. నిదానంగా అయినా ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారని ఆశిస్తోంది. అంతలోనే కేవలం ప్లాస్టిక్ కవర్ లేదన్న చిన్న కారణానికి ఓ మనిషిని చంపేశాడు 24 ఏళ్ల యువకుడు.
ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కలిగిస్తుంది. వాడి పడేసిన కవర్లు మట్టిలో కలవకపోగా వాటిని తింటున్న మూగజీవాలు బలవుతున్నాయి. ఆవులు, గేదెల కడుపులో కిలోల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు ఉన్న దాఖలాలెన్నింటినో చూస్తున్నాము. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ప్లాస్టిక్‌పై యుద్దం మొదలు పెట్టింది. పాలిథీన్ కవర్లు వాడుతున్నట్టు తెలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో వ్యాపారస్తులు భయపడుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే వినియోగదారులకు కవర్లు ఇవ్వడం మానేశారు. అయినా అదేమీ పట్టించుకోకుండా కవర్ ఇస్తావా ఛస్తావా అంటూ ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఉగ్రరూపం దాల్చాడు. నిష్కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు.
దయాల్పూర్ ప్రాంతంలోని ఓ బేకరీలో 45 ఏళ్ల ఖలీల్ అహ్మద్ పని చేస్తున్నాడు. ప్లాస్టిక్ నిషేధం కొనసాగుతుండడంతో కవర్లు ఇవ్వడం ఆపేసింది బేకరీ యాజమాన్యం. బేకరీకి వచ్చిన ఫైజాన్ ఖాన్ అనే యువకుడు వస్తువు కొనుక్కున్నప్పుడు కవర్ ఇవ్వకపోతే ఎలా తీసుకెళతారంటూ గొడవకు దిగాడు. తనకు కవర్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఖలీల్‌పై ఘర్షణకు దిగిన ఫైజాన్ ఖాన్ కోపంతో బేకరీ బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న ఇటుక రాయి తీసుకుని ఖలీల్‌పై తలపై బలంగా కొట్టాడు. దీంతో రక్తం కారుతూ ఖలీల్ కింద పడిపోయాడు. అది చూసి భయంతో పరుగు తీసాడు ఫైజాన్ ఖాన్. తీవ్రంగా గాయపడిన ఖలీల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన ఫైజాన్ కోసం గాలిస్తున్నారు. దొరికితే అరెస్ట్ చేస్తామని అంటున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com