రోజూ ఓ గుప్పెడు శెనగలు..


కాలేజీలో జాయినయిన దగ్గర్నుంచి అమ్మాయి నాన్‌వెజ్ తినడం మానేసిందని అమ్మ ఆందోళన. నాజూగ్గా ఉండడం ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలం పిల్లలకు. బయటి తిండ్లు తింటే బలం ఎలా వస్తుంది అని నాన్న మందలింపు. రోజూ ఓ గుప్పెడు శనగలు మీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి సరిపడా ప్రొటీన్ అందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఓ గుప్పెడు శెనగలు నీటిలో వేసి మర్నాటి ఉదయం శుభ్రంగా కడిగి చిటికెడు ఉప్పు వేసి ఉడికించి తింటే మంచిదంటున్నారు. ఇది మాంసాహారంతో సమానమని కూడా వివరిస్తున్నారు.
ప్రొటీన్, పీచు పదార్థం ఎక్కువగా ఉండే శెనగలు శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. 100 గ్రాముల శెనగలలో 9 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదికల ప్రకారం కొలెస్ట్రాల్ అసలు ఉండదు. వీటిల్లో ప్రొటీన్, పీచు ఎక్కువగా ఉండడం వలన తిన్న వెంటనే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి అవదు. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి శరీర బరువు తగ్గాలనుకునే వారు రోజూ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
శెనగల్లోని పీచుపదార్ధం రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కె వంటి విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉంచడానికి తోడ్పడతాయి. కాల్షియం తక్కువగా ఉన్నవారు శెనగలను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శెనగలు తరచుగా తీసుకుంటూ ఉంటే గుండె పని తీరు బావుంటుంది. శెనగల్లో ఉండే విటమిన్ బి9 కండరాల అభివృద్ధికి, నాడీవ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది. కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది. పీచు పదార్థం అధికమొత్తంలో ఉండడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

