వైసీపీ నేతల అవినీతిపై పోరాటం : చంద్రబాబు

వైసీపీ నేతల అవినీతిపై పోరాటం : చంద్రబాబు
X

ఏపీలో ఇసుక కొరతపై ఉద్యమానికి సిద్ధమవుతోంది టీడీపీ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలకు పిలుపిచ్చింది. అన్ని జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఇక వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు.. ఇసుక కొరత వైసీపీ ప్రభుత్వం సృష్టించిందేనన్నారు.. లక్షలాది మంది కూలీలను పస్తులు పెడుతోందని మండిపడ్డారు. కొరతను సాకుగా చూపించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కూలీల గోడును మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి సమయంలో పనులు కోల్పోయిన కార్మికులకు మనమే అండగా ఉండాలని చంద్రబాబు అన్నారు. సమస్యకు పరిష్కారం చూపించలేక ఈ ప్రభుత్వం వాయిదాల మార్గాన్ని ఎంచుకుందంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసన కార్యక్రమాలు ఉండాలని పిలుపునిచ్చారు.. అయితే, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో నిరసనలు పండుగ తర్వాత నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

ఇసుక రీచ్ ల కోసం కుమ్ములాటలు, ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు.. ఇలాంటి వాటన్నిటిపైనా సమాచారం సేకరించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.. వాలంటీర్ల ముసుగులో ప్రభుత్వం తమ వారికి దోచిపెడుతోందని ఫైరయ్యారు. గ్రామాల్లో పనులు చేసి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు.. ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ధైర్యంగా పోరాడుదామని అన్నారు.. బాధితుల్లో భరోసా నింపే ప్రయత్నం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే అక్రమ కేసులపైనా న్యాయ పోరాటం చేయాలన్నారు.. అవసరమైతే ప్రైవేటు కేసులు వేయాలని, వైసీపీ నేతల అవినీతిని వెలికితీసి దానిపైనా పోరాటం చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags

Next Story