ఈ రోజు బంగారం కొంటే మంచిదట..

ఈ రోజు బంగారం కొంటే మంచిదట..
X

బంగారం.. ఇది ఆభరణం మాత్రమే కాదు.. ఖరీదైన, సెంటిమెంట్ వస్తువు.. ప్రపంచమంతా బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లా చూస్తుంటే.. మన దేశంలో మాత్రం దీనిని సెంటిమెంట్‌గా భావిస్తారు. భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండుగొచ్చినా, పబ్బమొచ్చినా, పెళ్లయినా, శుభకార్యం తలపెట్టినా కచ్చితంగా బంగారం కొనితీరాల్సిందే.. అంత విడదీయరాని బంధం ఉంది.

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.. కొన్ని పండుగ సమయాల్లో ఈ సెంటిమెంట్‌ వేలకోట్ల వ్యాపారానికి కారణమవుతుంది. ధన త్రయోదశి, అక్షయ తృతీయ.. ఇవి బంగారు పండుగలు.. ఏడాదంతా బిజినెస్‌ ఎలా ఉన్నా.. ఈ రెండు రోజులు మాత్రం నగల షాపులు జనంతో కిటకిట లాడుతుంటాయి. అంతేకాదు బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే వారు ఈ శుభదినాల్లో పసిడిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. ధర ఎక్కువైనా సరే ఆలోచించకుండా కొంటూ ఉంటారు. ధనవంతులు నక్లెస్‌ల వంటి ఆభరణాలు కొనుగోలుచేస్తే... మధ్య తరగతి ప్రజలు ఎంతో కొంత బంగారం కొంటారు. ఇక స్థోమతలేనివాళ్లు వెండితో సరిపెట్టుకుంటారు.

ధన్‌తేరస్ అనేది వాస్తవానికి ఉత్తరాధి సంప్రదాయం. రానురాను దేశం మొత్తం పాకింది. దీపావళికి ముందు ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ధన్‌తేరస్ వస్తుంది. దీనికి ధన త్రయోదశి, ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి... ఇలా ఎన్నో పేర్లున్నాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం దైవాన్ని పూజించే పర్వదినమే ధనత్రయోదశి. లక్ష్మీదేవి ధనదేవతగా ఆవిష్కృతమైన ఈ రోజున బంగారంగానీ, వెండిగానీ, పంచలోహాలనుగానీ కొనుగోలు చేస్తే... ఏడాదంతా అదృష్టం వరిస్తుందనేది జనం నమ్మకం.

ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన ఈ బంగారం మోజు, జ్యువెలరీ బిజినెస్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్తోంది.. ఈ రోజు బంగారం కొంటే మంచిదట.. అన్న ఒక్క సెంటిమెంట్‌, మహిళా లోకం జ్యుయెలరీ దుకాణాల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది. ధన్‌తేరస్‌నాడు కొనుగోలు చేసిన బంగారం, వెండిని దీపావళి రోజున లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఏడాదంతా ఐష్టశ్వర్యాలు సిద్ధిస్తాయనేది జనం విశ్వాసం. ఈ నమ్మకాన్నే వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి వ్యాపారులు కావాలనే దీన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా ధన్‌తేరస్ రోజున ఎంతోకొంత బంగారం, వెండి కొనాల్సిందేనని ప్రజల్లో సెంటిమెంట్‌గా మారింది. చివరికి ధరలు ఏ స్థాయిలో ఉన్నాసరే గోల్డ్ కంపల్సరీగా కొనాలి అనే పరిస్థితి ఏర్పడింది.

అయితే, ఈ ధంతేరాస్‌కు ఆశించిన స్థాయిలో బంగారం వ్యాపారం జరుగుతుందా అనేది అనుమానంగానే కనబడుతోంది.. కారణం, విపరీతంగా పెరిగిన ధరలేనని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నా.. 40వేల రూపాయలకు చేరువలోనే ఉంది.. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 38వేలకుపైగానే పలుకుతోంది.. దీంతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తారా ? లేదా ? అన్న సందేహం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. నగరంలో 22 వరకు పెద్ద పెద్ద దుకాణాలు ఉండగా, చిన్నవి సుమారు 200కి పైగా ఉన్నాయి. పుత్తడి ధర అమాంతంగా పెరిగినందు వల్ల ఈసారి అమ్మకాలు తగ్గవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.

Tags

Next Story