తెలంగాణలో ఆర్టీసీ ఇక చరిత్రే కానుందా?

తెలంగాణలో ఆర్టీసీ ఇక చరిత్రే కానుందా?

తెలంగాణలో ఆర్టీసీ ఇక చరిత్రే కానుందా? ఆర్టీసీపై కేసీఆర్‌ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారా? నిన్న సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇవే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. కేసీఆర్‌ వ్యాఖ్యలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సమ్మెపై తొలిసారి స్పందించిన ముఖ్యమంత్రి.. కార్మిక సంఘాల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. యూనియన్లే ఆర్టీసీని నష్టాల్లో ముంచాయని, ఇక ఆర్టీసీ బతికి బట్టకట్టలేదని తేల్చేశారు. అంతటితో ఆగకుండా ఒకే ఒక్క సంతకంతో భవిష్యత్తు నిర్ణయిస్తామంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు సీఎం కేసీఆర్‌. సమ్మె ముగియకపోతే.. ఆర్టీసీయే ముగుస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీపై కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిగ్గా మారింది.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కార్మికుల్లో కొత్త భయాన్ని పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి హెచ్చరికలతో అటు ఆర్టీసీ జేఏసీ కూడా అయోమయంలో పడిపోయింది. దీనిపై కార్మిక సంఘాలు కూడా ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నాయి. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.

26 డిమాండ్లలో నాయకులకు లబ్ధి చేకూరే అంశం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తమను బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని... సీఎం చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఆర్టీసీ జేఏసీ... నేడు సమావేశం కానుంది. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనుంది. కార్మికుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కూడా నేతలు నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story