కావాలి ఇసుక .. పోవాలి ఇసుక మాఫియా - తెలుగు తమ్ముళ్లు

ఏపీలో ఇసుక కొరతపై తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కావాలి ఇసుక - పోవాలి ఇసుక మాఫియా అన్న నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే ఇసుక కొరతపై స్పందించాలని.. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో.. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ హైకమాండ్ పిలుపు మేరకు 13 జిల్లాల్లో ఆందోళన చేపట్టారు ఆపార్టీ శ్రేణులు. వినూత్న నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ ఆందోళనల్లో భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఇసుక కొరతను నిరసిస్తూ తిరుపతిలో స్థానిక టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఇసుక విధానంతో లక్షల మంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు.
ఇసుక కొరతపై అటు విశాఖలోనూ టీడీపీ ఆందోళన చేపట్టింది. కావాలి ఇసుక-పోవాలి ఇసుక మాఫియా అంటూ ధర్నాకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన ధర్నాకు.. భవన నిర్మాణ నిర్మాణ కార్మికులు కూడా హాజరై నిరసన తెలిపారు.
ఇసుక కొరతపై టీడీపీ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద గుండు గీయించుకుని గాడిదపై ఊరేగుతూ వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇసుకను ఉచితంగా అందిస్తే.. జగన్ తీవ్ర కొరత సృష్టించారని ఆయన మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలోనూ టీడీపీ శ్రేణులు కదం తొక్కారు. అనంతపురం క్లాక్ టవర్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com