బీజేపీకి జై కొట్టిన లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి జై కొట్టిన లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్ కందా.. తనకు మరో ఐదుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్నారు. అందర్నీ BJPవైపు తీసుకొచ్చేందుకు సిద్ధమంటూ సిగ్నల్స్ పంపారు. మద్దతు విషయంపై మాట్లాడేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇవాళ జేపీ నడ్డాను కలవనున్నారని వార్తలొస్తున్నాయి. అభివృద్ధికి మద్దతు పలుకుతూనే BJPకి సపోర్ట్ చేస్తున్నట్టు కందా చెప్పారు. ఐతే.. ప్రభుత్వ ఏర్పాటు కోసం గోపాల్ కందాను తీసుకునేందుకు BJP సిద్ధమవడం విమర్శలకు తావిచ్చింది. వివాదాస్పద నేతగా కందాకు పేరుంది. గతంలో పలు కేసుల్లో ఆయన చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సపోర్ట్‌ను BJP ఎలా తీసుకుంటుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అటు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ ఈ అంశంపై మౌనం దాల్చారు. పార్టీ సమావేశానికి హాజరైన సమయంలో మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుపై తాము ధీమాగా ఉన్నామని ఖట్టర్ చెప్పుకొచ్చారు.
గోపాల్ కందా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. భూపేందర్ సింగ్ హుడా కేబినెట్లో ఉన్న సమయంలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టాయి. 2012లో గోపాల్ కందాకి చెందిన MDLR ఏవియేషన్ కంపెనీలో ఎయిర్‌హోస్టస్ గీతికా శర్మ సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్ లెటర్లో ప్రస్తావించిన అంశాలు సంచలనంగా మారాయి. కందా వేధింపుల కారణంగానే ఆమె చనిపోయినట్టు ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తర్వాత ఆ కేసుల నుంచి బయటపడినా.. వివాదాలు చుట్టుముట్టిన సమయంలో BJP కందాను తీవ్రంగా టార్గెట్ చేసింది. ఇప్పుడు అదే వ్యక్తి సపోర్ట కోసం ప్రయత్నించడం వివాదాస్పదమైంది.
90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీలో ఈసారి బీజేపీకి 40 మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 46కి 6 అడుగుల దూరంలో ఆగిపోయిన నేపథ్యంలో.. ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్ కందా తెరపైకి వచ్చారు. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో ఆయన చర్చలు జరుపుతున్నారు. సిర్సా నుంచి ఎన్నికైన కందా కేవలం 602 ఓట్లతో గట్టెక్కారు. కానీ.. ప్రస్తుత హంగ్ పరిస్థితుల్లో ప్రతి ఎమ్మెల్యే సపోర్ట్ కీలకం కావడంతో వివాదాస్పద నేతలకు కూడా కాలం కలిసి వచ్చేలాగే కనిపిస్తోంది. ఒకవేళ జననాయక్ జనతా పార్టీకి ఉన్న 10 మంది సపోర్ట్ BJPకి దక్కితే గోపాల్ కందా లాంటి వాళ్లను పక్కకు పెట్టే BJP ముందుకు వెళ్లిపోవచ్చు. కానీ JJP మద్దతుపై ఇంకా స్పష్టత లేకపోవడంతో.. ప్రస్తుతానికి స్వతంత్రుల్ని దగ్గరకు చేర్చుకోవడంపై BJP ఫోకస్ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com