ఈసారి దీపావళి ఇలా చేసుకుందామా..

నాన్నా.. నాకు క్రాకర్స్ కొనిస్తానని పోయిన వారం చెప్పావు.. ఇప్పటి వరకు కొనలేదు.. రేపే దీపావళి.. ఇంకెప్పుడు కొంటావు.. ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా రాకపోతే.. క్రాకర్స్ కొనకపోతే.. నేను అన్నం తినను.. పదేళ్ల బుజ్జిగాడు నాన్న మీద అలిగాడు.. ఇంట్లో ఉన్న అమ్మను సతాయిస్తున్నాడు.. చేతికి అందినవి విసిరేస్తున్నాడు. ఇల్లంతా గందరగోళం చేస్తున్న బుజ్జిగాడిని బామ్మ, తాత దగ్గరకు తీసుకుని నాలుగు మంచి మాటలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వాడిని దగ్గరలో ఉన్న పార్క్‌కి తీసుకెళ్లి కొద్ది సేపు ఆడుకోమన్నారు. అక్కడి నుంచి కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకుని అనాధాశ్రమానికి వెళ్లారు.
ఇక్కడ నీలాంటి పిల్లలే బోలెడంత మంది ఉన్నారు చూడు అంటూ అందర్నీ పరిచయం చేయించారు. బిస్కెట్లు, చాక్లెట్లు వాడి చేత ఇప్పించారు. అక్కడి పిల్లల ముఖాల్లో వెలుగులు చూసి బుజ్జిగాడికి సంతోషం వేసింది. అన్నీ మర్చి పోయి వాళ్లతో సరదాగా కాసేపు ఆడుకున్నాడు. నచ్చిన వాళ్లని ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాడు. ఇంక వెళ్దామా అని బామ్మ, తాత అనేదాక వాడు అక్కడ్నించి కదల్లేకపోయాడు. మళ్లీ ఎప్పుడు వస్తావు అని పిల్లలంతా అడిగేసరికి రేపు దీపావళి కదా.. మీకోసం క్రాకర్స్ తీసుకుని వస్తాను సరేనా అంటూ అందరికీ టాటా చెప్పి బయల్దేరాడు బుజ్జిగాడు. అక్కడి ఆయమ్మలు, టీచర్లు వాడు చూపించిన ప్రేమా, ఆప్యాయతలకు పులకించి పోయారు.
ఇంటికి వచ్చిన తరువాత అమ్మకి నాన్నకి ఆశ్రమం కబుర్లు చెప్పాడు. నాతో పాటు వాళ్లకి కూడా క్రాకర్స్ కొందామని నాన్నని బయల్దేరదీశాడు. బామ్మ తాత అప్పుడు చెప్పారు వాడికి.. నాన్నా వారికి క్రాకర్స్ కంటే విలువైనది ఏదైనా ఇస్తే బావుంటుందేమో, వారికి ఉపయోగ పడేది ఏదైనా ఇద్దామా అని వాడినే అడిగారు. చిట్టి బుర్ర కూడా ఆలోచించడం మొదలు పెట్టింది.. కావాలని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు తాత. వచ్చేది చలి కాలం కదా.. స్వెట్టర్, రగ్గులు లాంటివి ఏమైనా.. అని అన్నారు. దానికి వాడు కూడా అవును తాతా.. మా స్కూల్లో అందరూ స్వెటర్లు వేసుకుని వస్తున్నారు. నేను కూడా వాళ్లకి స్వెటర్లు పట్టుకెళ్లి ఇస్తాను అన్నాడు. మరి క్రాకర్స్ వద్దంటావా అని బామ్మ అడిగితే.. వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను కానీ కాకరపువ్వొత్తులు, చిచ్చు బుడ్లు లాంటివి కొంటాను. వాళ్లకీ కొన్ని ఇస్తాను అని అన్నాడు. అవైతే సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని అమ్మ కూడా వాటికి ఓటేసింది. గూళ్లకు చేరిన చిన్న చిన్న గువ్వ పిట్టలు టపాసుల సౌండ్‌కి బెదిరిపోతాయని అమ్మ వాడికి ముందే చెప్పి ఉండడంతో ఈసారి వాటి జోలికి వెళ్లలేదు. షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి సంతోషంగా నిద్ర పోయాడు బుజ్జిగాడు. ఈసారి దీపావళిని ఇంట్లో, ఆర్ఫన్ హోమ్‌లో ఆనందంగా చేసుకున్నాడు. ఇక నుంచి ప్రతి సంవత్సరం దీపావళి ఇలాగే చేసుకుంటానని అమ్మకి ప్రామిస్ చేశాడు. పిల్లలకి చిన్నప్పటినించే సేవాగుణం అలవాటు చేస్తే పెద్దయ్యాక ఉన్నంతలో కొంత సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకూడదని.. ఆ డబ్బులేవో ఓ మంచి పనికి ఉపయోగిస్తే అందులో ఉన్న ఆనందం వేరని స్వయంగా తెలుసుకునేలా చేసారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com