చర్చలు విఫలం

ఆర్టీసీ సమ్మెకు చర్చలతో శుభంకార్డు పడుతుంది అనుకుంటే.. పరిస్థితి మొదటికొచ్చింది. కార్మికుల అన్ని డిమాండ్లపై చర్చించేందుకు యాజమాన్యం సిద్ధంగా లేకపోవడంతో అవి అర్థాంతరంగా ముగిశాయి. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ స్పష్టంచేసింది. దీంతో తెలంగాణ ప్రజానికంలో పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. బస్సు చక్రాలు కదిలేదెప్పుడు..? ఆర్టీ సమ్మెకు ఎండ్ కార్డు పడేదెప్పుడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆర్టీసీ కార్మికులతో యాజమాన్యం చర్చలకు దిగడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. కచ్చితంగా ఒక ఫలితం వస్తుందని అంతా ఆశించారు. ఆర్టీసీ ముగిసిన అధ్యాయమని సీఎం కేసీఆర్ చెప్పిన తరువాత.. జరిగిన ఈ చర్చలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కానీ అందుకు విరుద్ధంగా చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఆర్టీసీ కార్మికులతో ఎండీ సునీల్ శర్మ చర్చలు జరిపారు. అన్ని డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక నేతలు పట్టుపడితే ఆర్టీసీ యాజమాన్యం అందుకు అంగీకరించలేదు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చించేందుకు యాజమాన్యం సిద్ధమవ్వడంతో ఆర్టీసీ సంఘాల నేతలు మధ్యలోనే బయటకు వచ్చేశారు.
కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ 21 డిమాండ్లపై మాత్రమే యాజమాన్యం చర్చిస్తామంటోందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. చిన్న చిన్న డిమాండ్లను కూడా పరిష్కరించలేకపోతున్నారని.. ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. యాజమాన్యం తీరుచూస్తే నిర్బంధంగా చర్చలకు పిలిచినట్టు ఉందన్నారు అశ్వత్థామ రెడ్డి. శత్రుదేశాలతో కూడా ఇంత నిర్బంధంగా చర్చలు జరిగి ఉండవని.. కేవలం కోర్టు చెప్పిందనే చర్చలకు పిలిచారని జేఏసీ నేతలు తప్పు పట్టారు. జేఏసీ నేతలతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని మరోనేత రాజిరెడ్డి తెలిపారు.
హైకోర్టు చెప్పిన 21 సమస్యలపైనా చర్చిస్తామని చెప్పినా... కార్మిక సంఘాలు వినలేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. బయటకు వెళ్లి వస్తామని చెప్పిన నేతలు తిరిగి చర్చలకు రాలేదని ఆయన ఆరోపించారు. అధికారులతో చర్చలు అర్థంతరంగా ముగియడంలో సమ్మె యథాతథంగా కొనసాగనుంది. తాజా చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇకపై సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com