ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న డెంగ్యూ

ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న డెంగ్యూ
X

ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తుల్ని డెంగ్యూ వ్యాధి పొట్టన పెట్టుకుంది. డెంగ్యూ వ్యాధి తమ కుటుంబం పై పగ పట్టినట్లు పక్షం రోజుల్లోనే తాత, మనవడు, మరో ఆరేళ్ళ బాలిక మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో ఇంట్లో విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ నగర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది.

శ్రీ నగర్ లో నివాసం ఉంటున్న గుడిమల్ల రాజగట్టు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరగా డెంగ్యూ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారం రోజులు చికిత్స అందించినా.. అప్పటికే పరిస్థితి విషమించటంతో ఈ నెల 16న మృతిచెందాడు. రాజగట్టు తండ్రి గుడిమల్ల లింగయ్య కూడా డెంగ్యూ వ్యాధి తో ఈనెల 20న మృతి చెందాడు. ఇద్దరు మరణంతోనే విషాదంలో మునిగిన కుటుంబానికి డెంగ్యూ రూపంలో రాజ కట్ట కూతురు చిన్నారి వర్షిని కూడా మాయదారి డెంగ్యూ పొట్టనపెట్టుకుంది. దీపావళి రోజునే చిన్నారి మృత్యువాత పడింది.

ఇప్పటికే ఈ డెంగ్యూ వ్యాధి ఆ కుటుంబంలోని మూడు తరాల వారిని కబలించింది. దీంతో పెనువిషాదంలో కుటుంబం ఉంది. దారుణం ఏమంటే.. ప్రస్తుతం రాజగట్టు భార్య సోనీ సైతం డెంగ్యూ వ్యాధి లక్షణాలతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్బిణీ. ఆమె అయినా క్షేమంగా తిరిగిరావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

అటు డెంగ్యూ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించినట్టు మీడియాలో కథనాలు రావడంతో జిల్లా వైద్య, మున్సిపల్ అధికారులు శ్రీనగర్ కాలనీకి చేరుకున్నారు. అయితే పలుమార్లు దోమల సమస్య ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. ముగ్గురు చనిపోయినట్టు పేపర్లలో వార్త వచ్చాక వస్తారా? అని స్థానికులు నిలదీశారు.

Tags

Next Story