ప్రతి రోజూ బట్టల షాపుకి ఓ అనుకోని అతిధి..


ఆ ఊర్లో ఆవులు, గేదెలను గడ్డి తినడానికి రోజూ ఊరి చివరికి తీసుకువెళుతుంటారు బర్రెలను కాసేవాళ్లు. చిత్రంగా ఓ ఆవు మాత్రం గుంపులో నుంచి నేను మీ జట్టు కాదు.. నా రూట్ సపరేట్ అన్నట్లు ఓ వస్త్రదుకాణానికి వెళ్లి అక్కడ కస్టమర్ల కోసం ఉంచిన పరుపు మీద కూర్చుంటుంది. దాదాపు మూడు గంటల పాటు వచ్చే పోయే వారిని చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో పేడ వేయడం కానీ, మూత్రం పోయడం కానీ చేయదని షాపు యజమాని అంటున్నారు. వైఎస్‌ఆర్ కడపజిల్లా మైదుకూరు పట్టణంలోని ఈ ఆవు తీరు స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పొలిమేర ఓబయ్య అనే వ్యక్తికి చెందిన సాయిరాం వస్త్ర దుకాణంలోకి ప్రతి రోజు ఓ ఆవు వస్తుంది. మొదటి రోజు ఆవుని లోపలికి రాకుండా అడ్డుకున్నా.. ఇది నా షాపు నువ్వెవరు అడ్డు చెప్పడానికి అన్నంత ధీమాగా లోపలికి వచ్చి కూర్చుంది. గోమాతకి పెద్ద పీట వేసే సంప్రదాయం మనది.. అంచేత ఆవుని అదిలించకుండా మిన్నకుండిపోయారు ఓబయ్య. దాంతో ఒకరోజు కాదు దాదాపు ఆరు నెలలుగా ఇదే తంతు. రోజూ రావడం. హ్యాపీగా మూడు గంటలు కూర్చోవడం, వెళ్లడం.. దాన్నొక డ్యూటీగా మార్చుకుంది ఆవు. ఓబయ్య భార్య కూడా గోమాతకి పసుపు, కుంకుమ పెట్టి పూజ చేస్తారు. ఆవు వచ్చిన తరువాత తమ వ్యాపారం కూడా పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు దంపతులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

