జాగిలం ఫోటోని విడుదల చేసిన ట్రంప్

ఐసిస్ నాయకుడు అల్ బగ్దాదీని పసికట్టి తరిమి తరిమి కుక్కచావు చచ్చేలా చేసిన జాగిలం ఫోటోను అమెరికా విడుదల చేసింది. అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వీర శునకం ఫోటోను ట్విట్టర్ వేదికగా ప్రపంచానికి చూపించారు. దాని ఘనతను కీర్తించారు. స్వల్పంగా గాయపడిన ఆ జాగిలాన్ని ఆపరేషన్ స్పాట్ నుంచి అమెరికా తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
సిరియా కేంద్రంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్-బగ్దాదీని అమెరికా సేనలు మొన్న మట్టుబెట్టాయి. పక్కా సమాచారంతో... పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యా సహాయంతో అతని జాడ కనిపెట్టిన అమెరికా సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. బగ్దాదీ చేతిలో దారుణ అత్యాచారానికి గురై హత్య చేయబడిన అమెరికా సామాజిక వేత్త కైలా ముల్లర్ పేరుతో ఆపరేషన్ సాగింది. ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో తలదాచుకున్న బగ్దాదీని వెంటాడాయి. దీంతో దిక్కుతోచని బగ్దాదీ... ఇంటి లోపల రహస్య మార్గం గుండా పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా అతన్ని మెరుపు వేగంతో వెంటాడాయి సైనిక జాగిలాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com