గుడ్లు తీసుకురావా.. అయితే గుడ్‌బై


నా భార్య ఎంత గుడ్డో.. ప్రభుత్వం చెప్పిందని ప్రతి రోజూ గుడ్డు తింటోంది.. నాకూ పెడుతోంది.. అని పెళ్లైన కొత్తలో పెళ్లాన్ని చూసి సంబరపడ్డాడు. కానీ ఒక్క రోజు గుడ్డు లేకపోయినా ఇల్లు పీకి పందిరేస్తుందని ఊహించలేకపోయాడు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లా కాంపియర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళకు గుడ్డు అంటే చాలా ఇష్టం. రోజూ వంటలో గుడ్డు ఉండాల్సిందే. భర్త కూడా ఆలి మనసెరిగి మసలుకునేవాడు. డజన్లకొద్దీ గుడ్లు తెచ్చి పెడుతుండేవాడు. గుడ్లు ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఏ రోజైనా లేవంటే గొడవ చేసేంది. వెంటనే వెళ్లి తీసుకొచ్చేవాడు. ఓ రోజు మాత్రం ఓపిక నశించి ఒక్క రోజు కూడా గుడ్డు తినకపోతే ఉండలేవా అని భార్యని మందలించాడు. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత బతిమాలి, బామాలి భార్యామణిని ఇంటికి తీసుకువచ్చాడు. ఈమె ఇష్టాఇష్టాలు తెలుసుకున్న గ్రామానికి చెందిన మరో వ్యక్తి గులాబీతో కాకుండా గుడ్డుతో దగ్గరయ్యాడు. భర్తకు తెలియకుండా అతడితో చాటు మాటు సరసాలు సాగించింది. కానీ విషయం భర్తకు తెలిసి నిలదీశాడు. గుడ్లు తెమ్మంటే గొడవ చేస్తున్నావుగా అందుకే నువ్వు నాకు అక్కరలేదని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. పొద్దుపోయినా భార్య ఇంటికి రాకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు భర్త. వారి విచారణలో ఆమె ప్రియుడు కూడా కనిపించకుండా పోయాడని తేలింది. దాంతో ఇద్దరూ కలిసి పారిపోయి ఉంటారని భర్త, పోలీసులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

