ఛలో విశాఖపట్నం: జనసేన

ఛలో విశాఖపట్నం: జనసేన
X

PAVAN

ఏపీలో ఇసుక కొరత రోజురోజుకీ తీవ్రమవుతోంది. పనుల్లేక భవననిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. భవిష్యత్‌పై బెంగతో కొందరు బలవన్మరణాలకూ పాల్పడ్డారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ పోరుబాట పట్టారు. నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ పేరిట భారీ నిరసన ప్రదర్శనను తలపెట్టారు. భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై తన గళాన్ని వినిపించనున్నారు.

ఏపీలో ఇసుక కొరతపై ఇప్పటికే విపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నాయి. అయితే, అందరినీ ఏకతాటిపైకి తెచ్చేప్రయత్నం పవన్ చేస్తున్నారు. అందుకే లాంగ్‌మార్చ్‌కు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు కూడగడుతున్నారు. సమస్య పరిష్కారానికి రాజకీయ పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు పవన్. అందుకే వివిధ పార్టీల నేతలకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాల నేతలు మధు, రామకృష్ణ సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్, లోక్‌సత్తా, బీఎస్పీ నేతలు తెలిపారు. లాంగ్‌ మార్చ్‌ తలపెట్టడానికి గల కారణాలను నేతలకు వివరించారు పవన్. ఇసుక కొరత కారణంగా ఏపీలో ప్రత్యక్షంగా 17 లక్షల మంది.. పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విపక్షాలన్ని కలిసి పోరాడాల్సిన అవసరం పవన్ కోరారు.

లాంగ్‌ మార్చ్‌ కోసం జనసైనికులు సిద్ధం అవుతున్నారు. విజయవాడలో భవననిర్మాణ కార్మికులతో కలిసి పోస్టర్‌ విడుదల చేశారు. ఇసుక కొరతతో ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని జనసేన నాయకులు మండిపడ్డారు.

Tags

Next Story